‘చంద్రబాబు భాష సరిగా లేదు.. ఎవరికైనా బాధ కలిగి ప్రతిగా ధీటుగా స్పందిస్తే ప్రభుత్వానికేమీ సంబంధం ఉండదు’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు వైసీపీ నేతలపై చేస్తున్న విమర్శలు, వాడే భాషపై ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో వెల్లడించారు. సీఎం జగన్ ను కూడా వాడు.. వీడు అని సంబోధించడం సరికాదన్నారు. అధికారం కోల్పోయిన నాటి నుంచి చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో ఓడిపోవడం, వయసు మీద పడటం, ఇతర కారణాలతో జుగుప్సాకరమైన భాష మాట్లాడుతున్నారు. విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందపై ఇష్టారీతిన మాట్లాడుతున్న బాబు గతంలో ఆయనను కలిసిన ఫొటోను చూపి విమర్శించారు. స్వామీజీ హత్యా రాజకీయాలు నడుపుతున్నారని, సీఎం జగన్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అక్కడకే వెళ్తున్నారని విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి వైసీపీ నేతలపై బెదిరింపులకు దిగుతే సహించేది లేదన్నారు.