
ఓవైపు తన బేనర్లో వరుసగా సినిమాలు తీస్తూనే మరోవైపు వేరే వాళ్లు తీసిన ఏదైనా చిన్న సినిమాలో కంటెంట్ ఉందని తెలిస్తే దాన్ని తన బేనర్ ద్వారా రిలీజ్ చేస్తున్నాడు దిల్ రాజు. సినిమా చూపిస్త మావ.. కుమారి 21 ఎఫ్.. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాలు ఆ కోవలో వచ్చినవే. వీటి తర్వాత దిల్ రాజును ఆకర్షించిన చిన్న సినిమా ‘వెళ్లిపోమాకే’. యాకూబ్ అలీ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రానికి పని చేసిన వాళ్లందరూ కొత్త వాళ్లే. దీంతో విడుదల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటి టైంలో దిల్ రాజుకు ట్రైలర్ చూపించడం.. ఆయనకు నచ్చి సినిమా అంతా చూడటం.. సినిమా కూడా ఇంప్రెస్ చేయడంతో తన బేనర్ ద్వారా రిలీజ్ చేయడానికి అంగీకరించడం.. చకచకా జరిగిపోయాయి.
ఐతే ఈ సినిమా ఫస్ట్ కాపీ ఎప్పుడో రెడీ అయిపోయింది. మూడు నెలల కిందటే విడుదలకు ఏర్పాట్లు జరిగాయి. ఐతే అదే టైంలో డీమానిటైజేషన్ దెబ్బ తగిలింది రాజుకు. పైగా తన బేనర్లో నేను లోకల్.. శతమానం భవతి సినిమాలు తుది దశలో ఉన్నాయి. దీంతో ‘వెళ్లిపోమాకే’ సినిమాను పక్కనబెట్టాడు రాజు. ముందు వాటి సంగతి తేల్చాడు. వాటిని సరిగ్గా ప్రమోట్ చేసి.. మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేశాడు. మంచి ఫలితాలందుకున్నాడు. సొంత సినిమాల టెన్షన్లన్నీ తీరిపోయాక.. ఆ సినిమాలతో వసూళ్ల పంట పండించుకున్నాక ఇప్పుడు ‘వెళ్లిపోమాకే’ మీద దృష్టిపెట్టాడు.
ఈ సినిమా ఆడియో రిలీజ్ చేసి.. విడుదలకు కూడా డేట్ ఫిక్స్ చేశాడు. పెద్దగా పోటీ లేని మార్చి 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. అన్ సీజన్ అయినప్పటికీ.. ఇలాంటి చిన్న సినిమాను ఎక్స్‌క్లూజివ్‌గా రిలీజ్ చేయడం ముఖ్యమని భావించాడు రాజు. ఈ సినిమా ఒక లైబ్రరీ లాంటిదని.. ఈ సినిమా ఎలా తీశారో వర్ధమాన దర్శకులకు ఒక క్లాస్ కూడా పెట్టించాలనుకుంటున్నానని రాజు చెప్పడం చూస్తే ఇదేదో ప్రత్యేకమైన సినిమాలాగే అనిపిస్తోంది. మరి అంతగా ఏముందో ఇందులో మార్చి 10న తెలుసుకుందాం.
Recent Random Post: