
విలక్షణ నటుడు నాజర్ తమిళులకే కాదు.. తెలుగు వాళ్లకూ బాగా దగ్గరైపోయాడు. ఆయన్ని పర భాషా నటుడిలాగా చూడరు మన ప్రేక్షకులు. గత కొన్నేళ్లలో సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటూ మన ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు నాజర్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన తన గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. సినిమాల్లోకి రాకముందు హోటల్లో వెయిటర్‌గా పని చేయడం.. నటుడిగా మంచి స్థాయిలో ఉండగా నిర్మాణంలోకి వెళ్లి తన దగ్గరున్న డబ్బులన్నీ పోగొట్టుకోవడం గురించి ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు నాజర్.
‘‘నేను చదువుకుని ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నా. కానీ మా నాన్నగారు మాత్రం నన్ను నటుడిగా చూడాలనుకున్నారు. ఆయన డ్రామా ఆర్టిస్టు. నన్ను నటుడిగా చూడాలని తపించారు. నేను ముందు సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి తర్వాత తాజ్ హోటల్లో వెయిటర్‌గా చేరాను. అందులో పని చేసినంత కాలం చాలా సంతోషంగా ఉన్నాను. దాదాపు సినిమాల విషయం మరిచిపోయాను.
అప్పట్లోనే నాకు నెలకు 300 రూపాయలు జీతంతో పాటు టిప్పులు కూడా వచ్చేవి. ఐతే మా నాన్న బలవంతపెట్టడంతో వెయిటర్ జాబ్ మానేసి అడయార్ ఇన్స్టిట్యూట్లో చేరాను. ఇన్స్టిట్యూట్లో నాకు నటుడిగా గోల్డ్ మెడల్ వచ్చింది. అది చూపించి అవకాశాల కోసం ప్రయత్నించేవాడిని. యాక్టింగ్ ఛాన్సులు రాకపోవడంతో డబ్బింగ్ ఆర్టిస్టునయ్యాను. నేను ముందు పారితోషకం తీసుకున్నది డబ్బింగ్ ఆర్టిస్టుగానే. రోజుకి 13 రూపాయలు ఇచ్చేవారు. ‘నాయకుడు’ సినిమాతో నా కెరీర్ మలుపు తిరిగింది. ఇక వెనుదిరిగి చూసుకోలేదు.
ఐతే అడయార్ ఇనిస్టిట్యూట్‌లో ఉన్నప్పుడు యాక్టింగ్‌తో పాటు డైరెక్షన్ కూడా నేర్పించేవారు. దీంతో నటుడిగా మంచి స్థాయిలో ఉండగా డైరెక్షన్ చేశాను. మంచి కథ ఉందని సొంతంగా సినిమా మొదలుపెట్టాను. అదే.. అవతారం. మొత్తంగా నా నిర్మాణంలో నాలుగు సినిమాలొచ్చాయి. ఆర్థికంగా బాగా నష్టపోయాను. మొత్తం రూ.2.5 కోట్లు పోగొట్టుకున్నా. రోడ్డుమీదకి వచ్చాను. సినిమాల్లో ఇలాంటివి జరగడం మామూలే అని సర్దుకున్నా. అదృష్టవశాత్తూ మళ్లీ నటుడిగా పుంజుకుని స్థిరపడ్డాను’’ అని నాజర్ తెలిపాడు.
Recent Random Post: