
బహుశా భారతీయ సినీ చరిత్రలోనే ‘బాహుబలిః ది కంక్లూజన్’ మీద ఉన్నంత అంచనాలు మరే సినిమాకూ ఉండి ఉండవంటే ఆశ్చర్యం లేదు. మొత్తం దేశమంతా ఈ సినిమా కోసం అంతగా ఎదురు చూస్తోంది. సినిమా విడుదలకు ఇంకో 50 రోజుల సమయం ఉండగా.. అంతకంటే ముందు ట్రైలర్ కోసం కూడా అంతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
ఈ నెల 15నే ‘బాహుబలిః ది కంక్లూజన్’ ట్రైలర్ విడుదల కాబోతున్నట్లు అప్ డేట్ వచ్చిన సంగతి తెలిసిందే. దాని మీద కూడా అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ఆ అంచనాల్ని మరింత పెంచేసే మాట చెప్పాడు కీరవాణి తమ్ముడు.. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ రమణ.
‘‘ఇప్పుడే బాహుబలి-2 ట్రైలర్ చూశా. నా గుండెలు అదిరిపోయినీయ్!సినిమాతో సంబంధం లేకుండ ఇది విడిగా 100 రోజులు ఆడుతుంది. నా మాటలు గుర్తు పెట్టుకోండి. ట్రైలర్ త్వరలోనే రిలీజవుతుంది’’ అని కళ్యాణ రమణ ట్విట్టర్లో పేర్కొన్నాడు.
అసలే ‘బాహుబలిః ది కంక్లూజన్’ ట్రైలర్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే.. కళ్యాణ రమణ మాటలు చూశాక ఇక వారు ఆగడం కష్టమే. రెండేళ్ల కిందట ‘బాహుబలిః ది బిగినింగ్’ ట్రైలర్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండో ట్రైలర్ దానికి ఏమాత్రం తగ్గబోదని కళ్యాణ రమణ మాటల్ని బట్టి అర్థమవుతోంది. అంతగా ఆ ట్రైలర్లో ఏముందో ఈ నెల 15న తెలుసుకుందాం.
Recent Random Post: