
ఇంతకాలానికి వైఎస్ ఫ్యామిలీకి అడ్డాగా నిలిచిన కడప కోటలో చంద్రబాబు పాగా వేయగలిగారు. తాజాగా జరిగిన కడప స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని రీతిలో షాక్ ఇవ్వటంతో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. తాజా ఓటమి జగన్ కు ఎంత పెద్దదంటే.. సొంత బాబాయ్‌ని తన పుట్టింట్లో గెలిపించుకోలేని దీన స్థితికి దిగజారిపోయారన్న విషయం తాజా ఫలితం స్పష్టం చేసినట్లుగా చెప్పాలి.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరూ వ్యక్తిగతంగా తీసుకున్నారు. తామే ముఖాముఖిన తలపడితే గెలుపు కోసం ఎంతలా ప్రయత్నాలు చేస్తారో.. అంతలా ప్రయత్నాలు చేశారు ఇరువురు అధినేతలు. సాంకేతికంగా చూసినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ కు గెలుపు పక్కా అన్నట్లుగా అంకెలు ఉన్నప్పటికీ.. జగన్ నాయకత్వాన్ని క్వశ్చన్ చేసేలా.. ఆయన తీరును తప్పు పట్టేలా.. పార్టీ నేతలకు కొత్త భయాన్ని కలిగించేలా కడప ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం వెలువడిందని చెప్పక తప్పదు.
ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి పోలింగ్ రోజు వరకూ ఇరు పార్టీల అధినేతలు ప్రత్యేక దృష్టిని ఈ ఎన్నిక మీద పెట్టారు. రోజువారీగా ఈ ఎన్నిక మీద ఇరువురు అధినేతలు ఫాలో అప్ చేసినట్లుగా చెబుతారు. టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవిని రంగంలోకి దించగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.. జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని బరిలోని దించారు. భావోద్వేగంగానూ.. వివేకకు ఉన్న గుడ్ విల్ నేపథ్యంలో గెలుపు పక్కా కావాలన్న ఉద్దేశంతో వివేకను అభ్యర్థిగా ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు.
ఎన్నో ఏళ్లుగా కడప కోటలో పాగా వేయాలన్న కోరికను చంద్రబాబు.. తాజా ఎన్నికల ఫలితంతో తీర్చుకున్నట్లుగా చెప్పాలి. ఇందుకోసం నిర్మాణాత్మకంగా వ్యవహరించిన బాబు.. పక్కా వ్యూహంతో
కడప ఎమ్మెల్సీలో సంచలన విజయాన్ని సాధించినట్లుగా చెప్పాలి. తాజా విజయంతో 40 ఏళ్లుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన కడప కోటను తాము బద్ధలు కొట్టినట్లుగా తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి 433 ఓట్లు రాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ వివేకకు 399 ఓట్లు రాగా.. ఏడు ఓట్లు చెల్లలేదు. మొత్తం 34 ఓట్ల తేడాతో బీటెక్ రవి సంచలన విజయాన్ని సాధించారు. జగన్ పార్టీకి చెందిన నేతల క్రాస్ ఓటింగ్‌తోనే తాజా విజయం సాధ్యమైనట్లుగా చెప్పొచ్చు. తాజా ఫలితం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ గా చెప్పక తప్పదు.
Recent Random Post:

















