సొంత జిల్లా మీద‌నే ప‌ట్టు మిస్ అవుతోన్న బాబు

సొంత నియోజ‌క‌వ‌ర్గం.. సొంత జిల్లా.. ఆ త‌ర్వాత ఇంకేమైనా అన్న‌ట్లుంటుంది రాజ‌కీయాల్లో. ఒక నేత ఎద‌గాలంటే ఈ ఆర్డ‌ర్ త‌ప్ప‌నిస‌రి. నేత‌ల‌కే కాదు.. అధినేత‌ల‌కూ ఇదే సూత్రం అప్లై అవుతుంది. త‌న‌కెంతో విశేష అనుభ‌వం ఉంద‌ని చెప్పుకునే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం.. తాజాగా ఈ ఆర్డ‌ర్‌ను మిస్ అయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల్లో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఏమీ ఉండ‌ద‌న్న‌ది అంద‌రికి తెలిసిన విష‌య‌మే. ఇక‌.. బాబు లాంటి అధినేత ఉన్న‌పార్టీలో సిట్ అండ్ స్టాండ్ ప‌ద్ద‌తే త‌ప్పించి మ‌రింకేమీ ఉండ‌దు. గ‌తంలో మాదిరి కొన్ని అంశాల మీద‌నైనా సామాజిక స్పృహ‌.. క‌మిట్ మెంట్ ఉండే నాయ‌కులు పోయి చాలా కాల‌మే అయ్యింది.

ఇప్పుడు మిగిలిన విష‌యాల మీద వైఖ‌రి ఎలా ఉన్నా.. అధినేత మీద అప‌రిమిత‌మైన విన‌య‌.. విధేయ‌త‌లు.. విశ్వాసాలు ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఏ రాజ‌కీయ నేత ఎదుగుద‌ల‌కు ఈ ఆర్డ‌ర్ త‌ప్ప‌నిస‌రి. అలాంటి వారికే పెద్ద‌పీట వేస్తూ.. ప‌ద‌వులు అప్ప‌జెబుతున్న వైనం స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. మ‌రేం అయ్యిందో ఏమో కానీ.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. క్లియ‌ర్ క‌ట్ మెజార్టీతో పాటు.. గోడ దూకించిన జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న వేళ‌.. రాజ‌కీయంగా త‌న‌కు తిరుగులేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు చంద్ర‌బాబు.

చేతిలో ఎంత‌మంది ఎమ్మెల్యేలు ఎంత‌మంది ఉన్నార‌న్న‌ది ఎంత ముఖ్య‌మో.. ఎంత‌మంది విశ్వాసంగా ఉన్నార‌న్న‌ది చాలా కీల‌కం. ఎలాంటి ప‌రిస్థితుల్లోఅయినా.. త‌న వెంట న‌డిచేవారి సంఖ్య చాలా ముఖ్యం. ప్ర‌స్తుతం చంద్ర‌బాబులో మిస్ అవుతున్న‌ది అదే. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ విష‌యంలో అసంతృప్తి రేగ‌టం కామ‌న్‌. కానీ.. ఆ ఆగ్ర‌హ‌పు జ్వాల వారాల‌కు వారాలు కంటిన్యూ కావ‌టం అన్ కామ‌న్ అని చెప్ప‌క త‌ప్పుదు. బాబు లాంటి మొనగాడు అధినేత సీఎంగా ఉన్న‌ప్పుడు.. ఆయ‌నేం నిర్ణ‌యం తీసుకున్నా.. ఎదురు స‌మాధానం చెప్ప‌టానికి గ‌తంలో వ‌ణికిపోయేవారు.
ఇప్పుడా ప‌రిస్థితి లేద‌నే చెప్పాలి. ప్రతి విష‌యంలోనూ రాజీ ప‌డ‌టంతో పాటు.. తాను చెప్పే న‌మ్మ‌కాలు.. సిద్ధాంతాల్ని బాబు మార్చుకున్నంత ఈజీగా మ‌రే అధినేతా మార్చుకోర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదే.. అటు ప్ర‌జ‌ల్లోనూ.. ఇటు నేత‌ల్లోనూ బాబు మీద అభిమానం బ్యాలెన్స్ మిస్ అయ్యేట‌ట్లు చేస్తుంద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ అనంత‌రం.. ప‌ద‌విని కోల్పోయిన మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి బాబు మీద గుస్సా కావ‌ట‌మే కాదు.. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌టం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌నీ విష‌యం మీద వెనెక్కి త‌గ్గింది లేదు. కొంత రాయ‌బారం న‌డిచిన‌ప్ప‌టికీ బొజ్జ‌ల వెన‌క్కి త‌గ్గ‌లేదు. అంతేకాదు.. త‌న రాజీనామా మీద త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకుంటాన‌ని డెడ్ లైన్ పెట్టటం విశేషం.

ఇదిలా ఉంటే.. తాజాగా టీడీపీ ఎంపీ.. బాబు సొంత జిల్లాకు చెందిన శివ‌ప్ర‌సాద్ రేపిన క‌ల‌క‌లం ఎంతో తెలిసిందే. అంబేడ్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా బాబు పాల‌న మీద విమ‌ర్శ‌లు చేసిన ఆయ‌న‌.. త‌ర్వాత బాబు క్లాస్ పీకిన త‌ర్వాత కూడా వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఇదంతా చూసిన‌ప్పుడు.. బాబుకు త‌న సొంత జిల్లా త‌మ్ముళ్ల మీద‌నే ప‌ట్టు మిస్ అవుతున్న‌ట్లుగా చెప్పొచ్చు.

రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉన్న వ్య‌క్తి.. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జిల్లాకు చెందిన ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌లు త‌న వైఖ‌రి విష‌యంలో  గుస్సా కావ‌టం గ‌మ‌నార్హం. బుజ్జ‌గింపులు.. బెదిరింపుల‌కు ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ ఇద్ద‌రు నేత‌ల తీరు చూస్తున్న‌ప్పుడు బాబుకు సొంత పార్టీలో.. సొంత జిల్లాలో త‌గ్గిన ప‌ర‌ప‌తి ఇట్టే క‌నిపిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌న అడ్డా లోనే త‌న మాట విన‌ని నేత‌ల తీరుతో బాబును ఇప్పుడు తోపుగా ఎంత మాత్రం వ్య‌వ‌హ‌రించ‌లేమ‌న్న మాట సొంత పార్టీ నేత‌ల నోటి నుంచే వినిపిస్తోంది. ఇది.. బాబుకు నిజంగానే బ్యాడ్ న్యూసేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Recent Random Post: