బిగ్‌ బ్రేకింగ్‌: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేత

టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి హైకోర్టు ఊరటనిచ్చింది. వైసీపీ రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే ఏబీ వెంకటేశ్వరరావుని కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధుల నుంచి తప్పించడం, ఆ తర్వాత బోల్డన్ని రాజకీయ విమర్శలు తెరపైకి రావడం తెల్సిన విషయాలే.

ఇక, ముఖ్యమంత్రి అవుతూనే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ఏబీ వెంకటేశ్వరరావుపై ‘చర్యలు’ షురూ చేశారు. ఆయనపై సస్పెన్షన్‌ వేటు కూడా వేసింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. భద్రతా ఉపకరణాల కొనుగోలు విషయంలో సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారన్నది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, ఏబీ వెంకటేశ్వరరావుపై చేసిన ఆరోపణ.

ఇక, వైసీపీ నేతలైతే ఏబీ వెంకటేశ్వరరావుని దేశద్రోహిగా చిత్రీకరించేందుకూ వెనుకాడలేదు. ఓ దశలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) కూడా, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ని సమర్థించింది. అయితే, హైకోర్టు తీర్పుతో ఏబీ వెంకటేశ్వరరావుకి అనూహ్యమైన స్థాయిలో ఊరట దక్కిందనే చెప్పాలి. సస్పెన్షన్‌ కాలానికి వేతనం చెల్లించడంతోపాటుగా, ఆయన్ని విధుల్లోకి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇది వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి ఊహించని ఎదురుదెబ్బగా భావించాలేమో.!