అమరావతిలో భూముల కుంభకోణం.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలాకాలంగా ఆరోపణలు చేస్తోంది. అధికారంలోకి వస్తూనే, అమరావతిలో భూముల కుంభకోణానికి సంబంధించి ‘నిజాలు వెలుగులోకి తెస్తాం..’ అని వైసీపీ మరింత గట్టిగా నినదించిన మాట వాస్తవం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, పలువురు మంత్రులు.. వీలు చిక్కినప్పుడల్లా ప్రస్తుత ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపైనా, ఆయన తనయుడు నారా లోకేష్‌పైనా అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు చేస్తూనే వున్నారు.
మంత్రుల స్థాయిలో చర్చలు జరిగాయి.. కమిటీలు ఏర్పడ్డాయి.. నివేదికలు వచ్చాయి.. ఇప్పుడీ వ్యవహారంలో దూకుడు కన్పిస్తోంది కూడా. ఓ డిప్యూటీ కలెక్టర్‌ని ఇటీవలే అరెస్ట్ చేయడంతో.. ఒక్కసారిగా రాజకీయ అలజడి షురూ అయ్యింది అమరావతి భూములకు సంబంధించి. ‘అవినీతి అధికారుల గుండెల్లో గుబులు..’ అంటూ అధికార పార్టీకి చెందిన మీడియా సంస్థ పుంఖాను పుంఖాలుగా కథనాల్ని తెరపైకి తెస్తోంది. ఏ ప్రభుత్వమైనా అవినీతిని వెలికి తీస్తే అభినందించి తీరాల్సిందే. కానీ, చరిత్రలోకి తొంగి చూస్తే, అవినీతిపరుల బండారం బయటపడిన సందర్భాలు చాలా తక్కువగా కన్పిస్తాయి.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి కొందరి విషయాల్ని పక్కన పెడితే, చాలా సందర్భాల్లో నేతలు తప్పించుకోవడం సర్వసాధారణం. ఇక్కడ అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నది టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్. వైసీపీ చేసిన ఆరోపణలు చాలావరకు ఈ ఇద్దరి మీదనే.
మరి, ‘పెద్ద గద్దల జాతకాలు తేలతాయ్..’ అంటున్న వైసీపీ నేతలు, మంత్రులు.. ఆ దిశగా విజయం సాధిస్తారా.? అసలు అమరావతిలో భూ కుంభకోణంలో నిజమెంత.? లబ్దిదారులెవరు.? పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారిన విషయమే నిజమైతే.. ఆ డబ్బుని ఖజానాలోకి తిరిగి చేర్చగలుగుతారా.? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తేలాల్సి వుంది. రాజధానిగా అమరావతి కొనసాగాల్సిందేనంటున్న రైతులు కూడా, ప్రభుత్వం చెబుతున్న భూ కుంభకోణంలో వాస్తవాలు తెలియాలనే డిమాండ్ చేస్తున్నారు.