
కోలీవుడ్ నుంచో.. బాలీవుడ్ నుంచో మనవాళ్లు కథల్ని అరువు తెచ్చుకోవడమే తప్ప.. మన కథల్ని వాళ్లు అడగడం అరుదుగా ఉండేది ఒకప్పుడు. మన సినిమాలు వేరే భాషల్లో రీమేక్ అయినా.. అవి చాలా వరకు పెద్ద సినిమాలే అయ్యుండేవి. కానీ గత కొన్నేళ్లలో ట్రెండ్ మారింది. మన సినిమాలు పెద్ద ఎత్తున పొరుగు భాషలకు వెళ్తున్నాయి. అందులో చిన్న సినిమాలు చాలానే ఉంటున్నాయి. గత ఏడాద క్షణం, పెళ్లిచూపులు, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి చిన్న సినిమాలు వేరే భాషల వాళ్లను ఆకర్షించాయి. ఈ కోవలోనే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కూడా చేరింది. ఈ చిత్రం బాలీవుడ్లో రీమేక్ కాబోతుండటం విశేషం.
బాలీవుడ్‌కు చెందినఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అక్కడి నేటివిటీకి తగ్గట్లుగా ఈ కథను మార్చి రీమేక్‌ను తెరకెక్కిస్తారని సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు బయటికి రాలేదు కానీ.. నారా రోహిత్ అండ్ కో రీమేక్ హక్కులైతే అమ్మేశారట. ఇది వాస్తవానికి ఓ ఉత్తరాది వ్యక్తి నిజ జీవిత కథ స్ఫూర్తిగా తెరకెక్కించిన సినిమా అని సమాచారం.
రైల్వే రాజు క్యారెక్టర్ నిజ జీవిత స్ఫూర్తితో అల్లుకున్నదే. ఇందులో చూపించిన అంశాలన్నీ కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా కనెక్టయ్యేవే. క్రికెట్ నేపథ్యం అంటే దేశంలో అన్ని రాష్ట్రాల వాళ్లకూ కనెక్టవుతుంది. బాలీవుడ్లో కొంచెం పెద్ద స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే మంచి విజయం సాధించే అవకాశముంది. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’లో శ్రీవిష్ణు లీడ్ రోల్ చేస్తే.. నారా రోహిత్ కీలక పాత్ర చేశాడు. తన మిత్రులతో కలిసి నారా రోహితే ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.
Recent Random Post:

















