బాహుబలి ట్రైలర్.. ఈసారి మళ్లీ మళ్లీ

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఘడియలకు దగ్గరపడిపోయాం. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ ఇంకో 24 గంటల్లోపే రిలీజవ్వబోతోంది. మిగతా భాషల వాళ్లందరూ గురువారం సాయంత్రానికి ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ చూస్తే తెలుగు ప్రేక్షకులు మాత్రం ఉదయమే ట్రైలర్ వీక్షించబోతున్నారు. ‘బాహుబలి: ది బిగినింగ్’ తరహాలోనే ‘కంక్లూజన్’ ట్రైలర్ ను కూడా థియేటర్లలో ప్రదర్శించబోతున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 300 థియేటర్లలో ‘బాహుబలి-2’ ట్రైలర్ ప్రదర్శించబోతున్నారు. ఉదయం 9-10 గంటల మధ్య ట్రైలర్ ప్రదర్శన ఉంటుంది.

‘ది కంక్లూజన్’ ట్రైలర్ కు సంబంధించి సెన్సార్ సర్టిఫికెట్ కూడా బాహుబలి నిర్మాతలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ట్రైలర్ నిడివి 2 నిమిషాల 20 సెకన్లు. మరి ఆ రెండు నిమిషాల 20 సెకన్లలో ప్రేక్షకుల్ని రాజమౌళి బృందం ఎక్కడెక్కడికి తీసుకెళ్లి ఎలా విహరింపజేస్తుందో చూడాలి. ఇంతకుముందు ‘బాముబలి: ది బిగినింగ్’ ట్రైలర్ ను ఉదయం 11 గంటల తర్వాత ప్రదర్శించడంతో రెగ్యులర్ షోలకు ఇబ్బందవుతుందని ఒక్కసారితో సరిపెట్టారు.

దీంతో ప్రేక్షకులు అప్పుడు చాలా డిజప్పాయింట్ అయ్యారు. ‘ది కంక్లూజన్’ ట్రైలర్ మాత్రం ఉదయం 9-10 మధ్యే వేయబోతున్నారు. కాబట్టి ఒకటికంటే ఎక్కువసార్లే థియేటర్లలో ట్రైలర్ ప్రదర్శితమయ్యే అవకాశముంది. ఉదయం ట్రైలర్ థియేటర్లలో ప్రదర్శితమయ్యాక.. సాయంత్రం ముంబయిలో జరిగే ప్రత్యేక వేడుకలో అధికారికంగా ట్రైలర్ లాంచ్ చేసి.. యూట్యూబ్ లోకి వదులుతారు.


Recent Random Post: