వావ్‌.. 30 రాష్ట్రాల్లోనూ బాహుబ‌లి రికార్డు

‘బాహుబ‌లి: ది కంక్లూజ‌న్’ తెలుగు రాష్ట్రాల్లో కొత్త రికార్డుల మోత మోగించ‌డం మ‌రీ ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన విష‌య‌మేమీ కాదు. ఇది ఊహించిందే. పైగా మ‌న ద‌గ్గ‌ర ఐదు.. ఆరు షోల‌కు అనుమ‌తి ఇచ్చారు. టికెట్ల రేట్లు పెంచుకునే సౌల‌భ్యం కూడా క‌ల్పించారు. కానీ ఇత‌ర రాష్ట్రాల్లో సైతం ఈ సినిమా క‌నీ వినీ ఎరుగ‌ని రికార్డులు నెల‌కొల్పుతుండ‌ట‌మే చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

ముఖ్యంగా త‌మిళ‌నాట ర‌జినీకాంత్.. విజ‌య్.. అజిత్ లాంటి సూప‌ర్ స్టార్ల సినిమాలు నెల‌కొల్పిన రికార్డుల్ని సైతం ‘బాహుబ‌లి-2’ బ‌ద్ద‌లు కొట్టేసింది. తొలి వారంలో ఇప్ప‌టిదాకా ఏ త‌మిళ సినిమాకు కూడా సాధ్యం కాని స్థాయిలో వ‌సూళ్లు రాబ‌ట్టింది.

తెలుగు రాష్ట్రాల‌తో పోలిస్తే స‌గం థియేట‌ర్లు కూడా లేని త‌మిళ‌నాడులో ‘బాహుబ‌లి: ది కంక్లూజ‌న్ తొలి వారంలోనే రూ.62 కోట్ల గ్రాస్‌.. రూ.51.2 కోట్ల నెట్‌.. రూ.33.28 కోట్ల షేర్ సాధించ‌డం విశేషం. ఇప్ప‌టిదాకా ర‌జినీ సినిమా సైతం ఫ‌స్ట్ వీక్‌లో ఈ స్థాయి వ‌సూళ్లు సాధించింది లేదు. ఒక్క త‌మిళ‌నాడు అనే కాదు.. దేశ‌వ్యాప్తంగా 30 రాష్ట్రాల్లోనూ తొలి వారం అత్య‌ధిక వ‌సూళ్లు సాధించి చ‌రిత్ర సృష్టించింది బాహుబ‌లి-2.

అది అనితర సాధ్య‌మైన రికార్డు. స‌మీప భ‌విష్య‌త్తులో ఈ రికార్డు బ‌ద్ద‌ల‌య్యే అవ‌కాశ‌మే ఉండ‌ద‌ని భావిస్తున్నారు. వారం రోజుల‌కే బాహుబ‌లి-2 దాదాపు రూ.830 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో ‘పీకే’ను దాటేసి ఇండియాస్ ఆల్ టైం హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.


Recent Random Post: