
‘బాహుబలి 2’కి వస్తోన్న వసూళ్లు తల పండిన ట్రేడ్ పండితులని కూడా అయోమయానికి గురి చేస్తున్నాయి. తెలుగు సినిమాకి ఇంతటి మార్కెట్ వుందనేది ఇంతకు ముందు తెలియదు. బాహుబలి 1కి వచ్చిన వసూళ్లే చాలా ఎక్కువని, రెండేళ్లలో మార్కెట్ ఏమీ పెరగలేదని అన్నారు. కానీ బాహుబలి 2 కొత్త లెక్కల్ని చూపిస్తోంది.
లోకల్ మార్కెట్‌ని వదిలేస్తే, ఓవర్సీస్‌లో బాహుబలి 2 సాధిస్తోన్న వసూళ్లు విస్మయ పరుస్తున్నాయి. ఈ చిత్రానికి అక్కడ అన్ని భాషలకీ కలిపి ఇప్పటికి దాదాపు పంతొమ్మిది మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. వీటిలో తెలుగు వెర్షన్‌కి అరవై శాతం వచ్చాయని అంటున్నారు. అంటే కేవలం తెలుగు వెర్షన్‌తోనే ఇక్కడ పది మిలియన్ డాలర్లకి పైగా వసూలయ్యాయి. ఒక సినిమాకి పది నుంచి పన్నెండు మిలియన్లు వసూలు చేసే సత్తా వున్నపుడు మిగిలిన సినిమాలు ఇక్కడ ఎంత వసూలు చేయాలి? కానీ కనీసం మూడు మిలియన్లు కలక్ట్ చేసిన సినిమా ఇంకోటి లేదు.
శ్రీమంతుడు ఒక్కటీ దగ్గరగా వచ్చింది కానీ బాహుబలి 1 వసూళ్లలో సగం కూడా అది కలక్ట్ చేయలేదు. ఇక సినిమా ఫ్లాప్ అయితే రెండు మిలియన్లు కూడా రావు. ఒక భారీ హిట్ సినిమాకీ, హిట్ సినిమాకీ, ఫ్లాప్ సినిమాలకీ మధ్య ఇంత వ్యత్యాసం వున్న మార్కెట్ మరొకటి లేదేమో. ఇంత అన్‌ప్రిడిక్టిబుల్‌గా వుండడం వల్లే ఈ మార్కెట్లో ఎక్కువ మంది బయ్యర్లు కోట్లలో లాస్ అవుతున్నారు. అతి తక్కువ రిస్కుతో పెళ్లి చూపులు లాంటి ఘన విజయాన్ని అందుకోవచ్చు, అతి పెద్ద రిస్కుతో బాహుబలి లాంటి బంగారుగనిని సొంతం చేసుకోవచ్చు. అయితే ఏది ముంచేస్తుందో, ఏది అందలమెక్కిస్తుందో అనేది ముందే ఊహించడం మాత్రం అసాధ్యం.
Recent Random Post:

















