
తెలుగులో ఓ పెద్ద సినిమా రిలీజవుతోందంటే ఆంధ్రప్రదేశ్ అంతటా ముందు రోజు అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోల హడావుడి మొదలైపోతుంది. తెలంగాణలోని జిల్లాల్లో ఈ సందడి లేకపోయినా హైదరాబాద్ వరకు బెనిఫిట్ షోలు పడుతుంటాయి. ఇవి అభిమాన సంఘాలు.. థియేటర్ యాజమాన్యాల ప్రోద్బలంతో నడిచే షోలు. ఐతే ‘బాహుబలి: ది కంక్లూజన్’కు ఇలా ప్రత్యేకంగా బెనిఫిట్ షోలు వేయట్లేదు.
స్వయంగా డిస్ట్రిబ్యూటర్లే ఏకతాటిపైకి వచ్చి ముందు రోజు రాత్రి 9 గంటల నుంచే పెయిడ్ ప్రివ్యూలు ప్లాన్ చేస్తుండటం విశేషం. తెలంగాణలో హైదరాబాద్ సహా పలు నగరాల్లో ముందు రోజు రాత్రి 8.30 నుంచి 10.30 మధ్య పెయిడ్ ప్రివ్యూలు పడుతున్నాయి. వీటికి బుకింగ్స్ కూడా ఆన్ లైన్.. ఆఫ్ లైన్లలో నడుస్తున్నాయి. ఇది చూసి ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్లు కూడా అప్రమత్తం అయ్యారు.
ఏపీలో సైతం బెనిఫిట్ షోలు రద్దు చేసి.. అధికారికంగా పెయిడ్ ప్రివ్యూలే వేసే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం నుంచి పెయిడ్ ప్రివ్యూలకు టికెట్లు అమ్మనున్నట్లు సమాచారం.
మరోవైపు బెంగళూరు.. చెన్నై నగరాల్లో సైతం బాహుబలి-2కు స్పెషల్ పెయిడ్ ప్రివ్యూలు వేస్తుండటం విశేషం. దాదాపుగా అన్ని చోట్లా పెయిడ్ ప్రివ్యూల టికెట్లను డిమాండకు తగ్గట్లుగా భారీ రేట్లకు అమ్ముతున్నారు. ఐతే ఒక రోజు ముందే బాహుబలి-2 చూసే అవకాశం దక్కుతుండటంతో టికెట్ రేట్ల గురించి జనాలు పెద్దగా పట్టించుకోవట్లేదు.
Recent Random Post: