తాప్సీ మంత్రం పని చేస్తోంది

తాప్సీ నటించిన తాజా బాలీవుడ్‌ చిత్రం ‘నామ్‌ షబానా’ శుక్రవారం రిలీజ్‌ అయింది. ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ రివ్యూలు వచ్చాయి. నటీనటులు బాగా చేసినప్పటికీ సినిమాలో విషయం లేదని చాలా మంది తేల్చేసారు. దాంతో ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న తాప్సీ కాస్త వర్రీ అయింది. పింక్‌ తర్వాత వచ్చిన రన్నింగ్‌ షాదీ చిత్రానికి డిపాజిట్లు కూడా దక్కకపోయే సరికి నామ్‌ షబానా ఆమెకి కీలకంగా మారింది.

అయితే ఈ చిత్రానికి పెద్ద పేర్లు ఇన్‌వాల్వ్‌ అవడం వల్ల ఆ ప్రభావం కలక్షన్లపై కనిపిస్తోంది. అక్షయ్‌కుమార్‌ ఇందులో ఎక్స్‌టెండెడ్‌ క్యామియో చేయడం, నీరజ్‌ పాండే నిర్మాత కావడంతో పాటు బేబీకి సీక్వెల్‌ అనే మరో పాయింట్‌ కూడా ఈ చిత్రానికి హెల్ప్‌ అవుతోంది. మొదటి రోజు అయిదు కోట్ల పైచిలుకు వసూళ్లు తెచ్చుకున్న ఈ చిత్రం శనివారం ఆరున్నర కోట్లకి పైగా రాబట్టింది.

శుక్రవారం కంటే శనివారం వసూళ్లు పెరిగాయంటే పబ్లిక్‌ టాక్‌ బాగానే వుందని అర్థమవుతోంది. ఆదివారం కూడా ఈ చిత్రం గ్రోత్‌ చూపించినట్టయితే, వీక్‌ డేస్‌లో స్టడీగా నడిచినా చివరకు ముప్పయ్‌ కోట్ల గ్రాస్‌ వసూలవుతుంది. తాప్సీ లాంటి యువ హీరోయిన్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రానికి ఈ రేంజ్‌ కలక్షన్లంటే చెప్పుకోతగ్గ విశేషమే.


Recent Random Post: