
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహా చిరాగ్గా ఉందట. పక్కనున్న రాష్ట్రంలో విపక్షం అంత బలంగా లేకపోవటం.. అధికారపక్షానికి ఏ మాత్రం ఇబ్బంది కలగనీయకుండా వ్యవహరిస్తుంటే.. అందుకు భిన్నమైన వాతావరణం ఏపీలో ఉండటాన్ని ఆయన భరించలేకపోతున్నారట. ఈ ఇబ్బంది ఒకలా ఉంటే.. ఇదే సమయంలో పార్టీకి చెందిన సొంత నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. తరచూ లక్ష్మణ రేఖను దాటుతున్న వైనం చిరాకు పుట్టిస్తుందని చెబుతున్నారు. పార్టీ నేతల తీరుతో ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ కావటం ఆయనకు మరింత మంట పుట్టేలా చేస్తోంది.
గతంలో మాదిరి కాకుండా.. సున్నితంగా చెప్పటం ద్వారా తమ్ముళ్ల మనసుల్ని నొప్పించకుండా ఉండేందుకు తాను చేస్తున్న ప్రయత్నాల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరుపై ఆయన గుస్సా ప్రదర్శిస్తున్నారు. తాజాగా అమరావతిలో పార్టీ సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఓవైపు తాను కష్టపడి పని చేస్తూ.. పార్టీకి.. ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే.. అందుకు భిన్నంగా పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లాల నేతల తీరుతో పాటు.. ఆ జిల్లాకు ఇన్ ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న మంత్రి అయ్యన్న పాత్రుడి వైఖరిపైనా చంద్రబాబు అసంతృప్తిలో ఉన్నారు. తాజా సమావేశంలో బాబు బరస్ట్ అయినట్లుగా చెబుతున్నారు.
గుంటూరు జిల్లాలో పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరును ప్రస్తావిస్తూ.. ఇదే రీతిలో తమ్ముళ్ల తీరు సాగితే.. తాను కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం పార్టీ సమీక్షా సమావేశాన్ని మంత్రి అయ్యన్నపాత్రుడు ఏర్పాటు చేస్తే.. దానికి జిల్లా నేతలు ఎవరూ హాజరు కాకపోవటాన్ని బాబు ప్రశ్నించినట్లుగా సమాచారం.
అయితే.. సమాచార లోపంతోనే తాము సమావేశానికి రాలేకపోయినట్లుగా నేతలు చెప్పినప్పటికీ.. బాబు సంతృప్తి చెందలేదని చెబుతున్నారు. జిల్లా నేతల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన చంద్రబాబు.. పనిలో పనిగా ఇన్ చార్జ్ మంత్రి అయ్యన్నపాత్రుడి తీరును సైతం తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది. పార్టీ ప్రతిష్ఠ దెబ్బ తినేలా వ్యవహరిస్తున్నారని చెప్పినట్లుగా సమాచారం. అంతర్గత కుమ్ములాటల్లో భాగంగా సొంత పార్టీ నేతల తీరుపైన అయ్యన్న పాత్రుడు మీడియాకు ఎక్కటాన్ని బాబు ప్రస్తావించి.. మరోసారి అదే తీరులో వ్యవహరిస్తే బాగోదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఊహించని రీతిలో ఫైర్ అయిన బాబు తీరు పార్టీలో హాట్ టాపిక్ గా మారిందని చెబుతున్నారు.
Recent Random Post: