చిరంజీవిని తిట్టిన నోళ్ళే.! ఇప్పుడు పొగుడుతున్నాయ్.!

సినిమా టిక్కెట్ల ధరల విషయమై కొన్నాళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తే, ‘బులుగు బ్యాచ్’ విపరీతంగా ఏడవడం చూశాం. సోషల్ మీడియా వేదికగా చిరంజీవి మీద పడి ఏడ్చింది బులుగు మంద. వైసీపీకి చెందిన నేతలెవరూ పెద్దగా విమర్శలు చేయలేదుగానీ, వాళ్ళ కనుసన్నల్లో నడిచే సోషల్ మీడియా కార్మికులకు అదనపు చెల్లింపులు చేసి మరీ చిరంజీవిని ట్రోల్ చేయడం చూశాం.

సీన్ మారిందిప్పుడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇటీవల చిరంజీవి కలిశాక, వైసీపీ బ్యాచ్ అంతా చిరంజీవికి మద్దతు తెలపడం ప్రారంభించాయి. నిన్న ‘బంగార్రాజు’ సినిమా వేడుక రాజమండ్రిలో జరిగితే (కరోనా ఆంక్షలున్నా, ప్రత్యేక వెసులుబాట్లు కల్పించినట్టున్నారు..) ఆ కార్యక్రమంలో చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చిన నాగార్జున, ‘చిరంజీవి, సీఎం జగన్ మోహన్ రెడ్డితో చర్చించారు. అది పరిశ్రమకు మేలు చేస్తుంది..’ అని చెప్పడం గమనార్హం.

నాగ్ చెప్పిన మాటల్ని, వైసీపీ అనుకూల మీడియా విపరీతంగా హైలైట్ చేస్తోంది. నిజానికి, ఈ పబ్లిసిటీని ఆహ్వానించి తీరాల్సిందే. చిరంజీవికి సంబంధించి నెగెటివ్ వార్తల్ని తప్ప, పనికొచ్చే వార్తల్ని ఏనాడూ తెరపైకి తీసుకురాని వైసీపీ అనుకూల మీడియా.. అదేనండీ బులుగు మీడియా, ఇప్పుడు చిరంజీవిని ఆకాశానికెత్తేస్తుండడం ఆశ్చర్యకరమే మరి.

చిత్రమేంటంటే, ఇదే వైసీపీ అనుకూల మీడియా ‘మా’ ఎన్నికల సమయంలో చిరంజీవిని ఏ స్థాయిలో బదనాం చేసిందో చూశాం. అప్పుడు విమర్శించిన వైసీపీ అనుకూల మీడియా, ఇప్పుడు చిరంజీవి భజనలో మునిగి తేలుతుండడాన్ని ఏమనుకోవాలి.? బహుశా దీన్నే ‘జ్ఞానోదయం’ అంటారేమో.!

అంతా బాగానే వుందిగానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి కలిశాక, సినీ పరిశ్రమకు జరిగిన మేలు ఏంటట.? వైసీపీ అధికార మీడియా కూడా ‘మేలు’ జరిగిందని చెబుతున్న దరిమిలా, ఆ మేలు తాలూకు ఫలితాలేంటో వివరిస్తే బావుంటుందేమో.!