ఆంధ్రప్రదేశ్‌లో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోన్న కరోనా వైరస్‌

ఆంధ్రప్రదేశ్‌ కరోనా పాజిటివ్‌ కేసుల పరంగా మరో సరికొత్త మైలురాయిని అందుకుంది. అత్యధికంగా ఈ రోజు 351 కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా రోజువారీ కేసుల్ని తీసుకుంటే ఇదే అత్యధికం. కొద్ది రోజుల క్రితం ఓ సారి 300 మార్క్‌ అందుకున్నా, అది కేవలం 304 మాత్రమే. ఈసారి ఏకంగా 350 మార్క్‌ని కూడా దాటేసింది. అయితే, ఈ 351 కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా 275గా వుంది. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన మరో 76 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దాంతో మొత్తంగా ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7071కి చేరింది. మొత్తం 90 మరణాలూ సంభవించాయి.

తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో మరణాల సంఖ్య తక్కువగా వున్నా, కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతుండడం గమనార్హం. మరోపక్క, తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్ట్‌లు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కరోనా టెస్ట్‌ల సంఖ్య 6 లక్షలకు చేరువలో వుంది. తెలంగాణలో ఈ సంఖ్య 50 వేలకు అటూ ఇటూగా మాత్రమే వుండడం గమనార్హం.

ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చేవారిపై ఆంక్షలు వున్నప్పటికీ ఎక్కువగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశంగానే చెప్పుకోవాల్సి వుంటుంది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో అన్ని చర్యలూ తీసుకుంటున్నామనీ, వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారనీ ప్రభుత్వం చెబుతోన్న విషయం విదితమే. ఇంతలా కట్టడి చర్యలు తీసుకుంటుంటే, కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డ్‌ స్థాయిలో ఎందుకు పెరుగుతున్నట్లు.? లాక్‌ డౌన్‌ నుంచి సడలింపులు పెరుగుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది.

జూన్‌ 21 నాటికి పీక్‌ స్టేజ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల పెరుగుదల వుంటుందని తొలుత అంచనా వేయగా, ఇప్పుడు ఆ పీక్‌ స్టేజ్‌ని నవంబర్‌లో మనం చూసే అవకాశం వుందంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిరోజూ అటూ ఇటూగా 11 నుంచి 12 వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ లెక్కన నవంబర్‌ నాటికి పీక్‌ స్టేజ్‌.. అంటే పరిస్థితి ఎలా వుంటుందో ఏమో.!


Recent Random Post: