ఏపీలో కరోనా లెక్కలు తగ్గాయ్‌.. కండిషన్స్‌ అప్లయ్‌.!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గాయ్‌. నిన్నటి లిస్ట్‌లో మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2137గా పేర్కొంది ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ. కానీ, చిత్రంగా ఈ రోజు 68 కొత్త కేసులు నమోదైతే, మొత్తం లెక్కని 2100గా చూపిస్తోంది. ఇక్కడ ‘మతలబు’ ఏంటి.? అని అంతా విస్తుపోతున్నారు.

అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా నమోదైన కేసులు 2100 అట. వీటికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారి లెక్క కలిపితే, ఇంకాస్త ఎక్కువట. అంటే, మైగ్రెంట్స్‌ లిస్ట్‌ని అసలు లిస్ట్‌ నుంచి వేరు చేశారన్నమాట. ఆ మైగ్రెంట్‌ లెక్క 105. దీనర్థం, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 2205 అవుతుంది.

తెలంగాణలో నిన్న మొత్తంగా 41 కేసులు నమోదు కాగా, అందులో 10 మైగ్రెంట్‌ కేసులు. దేశంలో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళేందుకు అవకాశాలు కల్పిస్తున్న దరిమిలా, ముందు ముందు ఈ మైగ్రెంట్‌ లెక్కలు మరింత పెరగబోతున్నాయి. ఈ తరుణంలో ‘గందరగోళపు లెక్కలు’ ఏమంత సమర్థనీయం కాదు. మన దేశంలోకి కరోనా వచ్చిందే.. మైగ్రెంట్స్‌ వల్ల. ఇతర దేశాల నుంచి ఈ కరోనా తొలుత మన దేశంలోకి వచ్చింది. ఆ తర్వాత అది సామాజిక వ్యాప్తి వరకూ చేరుకుంది.

ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కస్‌కి వెళ్ళి అక్కడ కరోనా అంటించుకుని వచ్చినవారిని మైగ్రెంట్స్‌ అని అనలేం కదా. చెన్నయ్‌ కోయంబేడు మార్కెట్‌కి వెళ్ళి కరోనా అంటించుకుని వచ్చినవారిని కూడా ప్రత్యేకంగానే చూపుతున్నా, ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసులుగానే భావిస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి ఎక్కువగా లేదని చెప్పడానికేనా ఈ ‘వేరే’ లెక్క.? అన్న అనుమానం కలుగుతోంది అందరికీ. 2 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేసి ‘ఘనతను’ సొంతం చేసుకున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, ఇప్పుడీ గందరగోళం లెక్కలతో అభాసుపాలవుతుండడం దురదృష్టకరం.

ఇదిలా వుంటే, కరోనా క్యాపిటల్‌గా మారిన కర్నూలులో ఈ రోజు కొత్త కేసులు ఏవీ నమోదు కాకపోవడం ఆహ్వానించదగ్గ విషయం. శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా రెండు కొత్త కేసులు నమోదవడం గమనార్హం. నెల్లూరులో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 12 కోయంబేడు లింకులున్నవి. చిత్తూరులో మొత్తంగా 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, గుంటూరులో ఐదు కేసులు నమోదయ్యాయి. కడప, కృష్ణా జిల్లాల్లో చెరో కేసు నమోదయ్యింది. వెస్ట్‌ గోదావరిలో ఓ కేసు నమోదయ్యింది.

ఇప్పటిదాకా రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 48 కాగా, 1192 మంది కోలుకున్నారు. 860 మంది చికిత్స పొందుతున్నారు.


Recent Random Post: