ఇక్కడ బిచ్చగాడు.. అక్కడ దంగల్

పోయినేడాది ‘బిచ్చగాడు’ పేరుతో తెలుగులో ఓ సినిమా రిలీజైనపుడు జనాలు మొదట దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. చాలామంది సోషల్ మీడియాలో ఈ టైటిల్ గురించి కామెడీ చేశారు. టైటిల్ ఇలా ఉంటే సినిమా ఎaలా ఆడుతుంది అన్నారు. కానీ ఆ సినిమా చాలా తక్కువ థియేటర్లలో రిలీజై.. ఆ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ లాంటి భారీ సినిమాను రీప్లేస్ చేసే స్థాయికి చేరుకుని.. అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్లింది.

ముందు ఈ సినిమా వసూళ్లు రెండు కోట్ల దాకా రావచ్చన్నారు. తర్వాత ఐదు కోట్లన్నారు. ఆపై పది కోట్లు.. పదిహేను కోట్లు.. ఇలా పెరుగుతూ పోయి ఏకంగా రూ.25 కోట్లు వసూలు చేసింది ‘బిచ్చగాడు’. టీవీల్లో కూడా ఈ సినిమాకు కళ్లు చెదిరే టీఆర్పీ రేటింగ్ వచ్చింది. డబ్బింగ్ చిత్రాల చరిత్రలోనే ‘బిచ్చగాడు’ది ఓ ప్రత్యేక అధ్యాయం అయింది.

సరిగ్గా ఇప్పుడు చైనాలో ‘దంగల్’ కూడా ఇలాగే చరిత్ర సృష్టించింది. చైనాలో ఇండియన్ సినిమాలకు ఎప్పుడూ పెద్ద మార్కెట్ లేదు. అక్కడ మన సినిమాలు విడుదలవడమే అరుదు. ఐతే అమీర్ ఖాన్ ‘3 ఇడియట్స్’ సినిమాతో చైనా ప్రేక్షకుల్ని కొంతమేర ఆకట్టుకున్నాడు. తర్వాత ‘పీకే’ అక్కడ మంచి వసూళ్లు రాబట్టింది. ఐతే ‘దంగల్’ విడుదలైనపుడు అక్కడ భారీ అంచనాలేమీ లేవు. కానీ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. మౌత్ పబ్లిసిటీతో సినిమా అనూహ్యంగా పుంజుకుంది.

ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయింది. ముందు వంద కోట్లన్నారు.. తర్వాత 200 కోట్లు.. 300 కోట్లు.. ఇలా లెక్క పెరుగుతూ పోయింది. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్ల మైలురాయిని దాటేసిందీ సినిమా. ఈ సినిమా ఇలా ఆడేసిందని అన్ని ఇండియన్ సినిమాలూ అలా ఆడేస్తాయనుకుంటే పొరబాటే. ఇక్కడ ‘బిచ్చగాడు’ విషయంలో మ్యాజిక్ జరిగినట్లే.. అక్కడ ‘దంగల్’ విషయంలో జరిగింది. జనాలు ఇలా అన్నిసార్లూ ఓ సినిమాకు ఎమోషనల్‌గా కనెక్టయిపోరు. ‘బిచ్చగాడు’ తర్వాత వచ్చిన విజయ్ ఆంటోనీ సినిమాలు కానీ.. మరే డబ్బింగ్ సినిమా కానీ అలా ఆడలేదు. ‘దంగల్’ తర్వాత కూడా చైనాలో ఇండియన్ సినిమాలు ఆడితే ఆడొచ్చు కానీ.. ఆ సినిమా లాగా మ్యాజిక్ చేయడం మాత్రం కష్టమేమో.


Recent Random Post: