
టాలీవుడ్లో సూపర్ ఫాస్ట్‌గా సినిమాలు తీసే దర్శకుల్లో ముందు పూరి జగన్నాత్ పేరు చెప్పుకోవాలి. రెండు వారాల్లో స్క్రిప్టు రెడీ చేసి.. రెండు మూడు నెలల్లో సినిమా ఫినిష్ చేయగల సత్తా ఆయన సొంతం. స్టార్లతో సినిమా అయినా సరే నాలుగైదు నెలల్లో కంప్లీట్ చేసేస్తాడు.
తాను డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పూరి ఈ విషయాన్నే ప్రస్తావిస్తున్నాడు. నిజంగా తాను డ్రగ్ అడిక్ట్ అయితే సినిమాలు ఎలా తీస్తా.. అంత వేగంగా ఎలా సినిమాలు పూర్తి చేయగలుగుతా.. ఇన్నేసి సినిమాలు ఎలా తీయగలుగుతా అని ప్రశ్నించాడు పూరి.
‘‘నేను గత నాలుగేళ్లలో మూడు నాలుగు సార్లు మాత్రమే పబ్బుకి వెళ్లాను. అసలు పబ్‌కి వెళ్లేంత టైమే నాకుండదు. నా తోటి డైరెక్టర్లు ఒక సినిమా చేసేలోపు నేను మూడు సినిమాలు చేస్తుంటాను. రోజులో ఐదారు గంటలకన్నా ఎక్కువగా పడుకోను. నాకు నిద్ర పోవడానికే టైమ్ ఉందు. ఒకవేళ నేను డ్రగ్ అడిక్ట్ అయితే ఇన్ని సినిమాలు ఎలా చేయగలుగుతాను? కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్, ప్రొడక్షన్.. ఇన్ని పనులూ ఒక్కణ్నే ఎలా చేయగలుగుతాను. ఈ విషయాలన్నీ ఎందుకు ఆలోచించరు. నాతో ఉన్న వాళ్ల మీదే ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు’’ అని పూరి ప్రశ్నించాడు.
సిట్ అధికారులు జరిపిన విచారణలో ఏం అడిగారు.. తానేం చెప్పానన్నది మీడియాలో వెల్లడించలేనని.. ఒక ఇష్యూ గురించి విచారణ జరుగుతున్నప్పుడు దాని గురించి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు కాబట్టే మాట్లాడట్లేదని.. ఐతే తనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని సిట్ అధికారులు అడగడాన్ని బట్టి తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందేమో అని సందేహించే పరిస్థితి వస్తోందని పూరి అన్నాడు.
Recent Random Post: