బాలుకు నోటీస్.. ఇళయరాజా వెర్షన్ ఇదీ

గానగంధర్వుడు ఎస్పీ బాలుకు ఇళయరాజా లీగల్ నోటీసులివ్వడం సౌత్ ఇండియా అంతటా పెద్ద సంచలనమే అయింది. బాలుకు మంచి మిత్రుడు కూడా అయిన ఇళయరాజా.. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోకుండా లీగల్ నోటీసుల వరకు వెళ్లడమేంటని అందర విమర్శిస్తున్నారు.

బాలు సైతం లీగల్ నోటీసుల విషయమై చాలా ఆవేదనతో స్పందించారు. తనకు ఇళయరాజా లీగల్ నోటీసులిచ్చాక.. ఇక తాను ఏం మాట్లాడతానని.. ఈ వ్యవహారాన్ని తాను కూడా లీగల్‌గానే డీల్ చేస్తానని అన్నారు. ఐతే లీగల్ నోటీసులిచ్చి విమర్శలెదుర్కొంటున్న ఇళయరాజా వెర్షన్ మరోలా ఉంది. ఆయన తరఫున ప్రదీప్ కుమార్ అనే ప్రతినిధి ఈ వివాదంపై మీడియాతో మాట్లాడారు.

ప్రదీప్ చెబుతున్నదాని ప్రకారం కాపీ రైట్స్ విషయమై బాలుకు ఇంతకుముందే ఫీలర్స్ ఇచ్చారట. కానీ ఆయన పట్టించుకోలేదట. దీంతో లీగల్ నోటీసులివ్వక తప్పలేదంటున్నాడతను. ఈ పరిస్థితిని కల్పించింది బాలుయేనని అతనన్నాడు. ఇళయరాజా పాటల మీద బతికే చిన్న చిన్న ఆర్కెస్ట్రాలకు గండి కొట్టాలని.. వాళ్లందరి దగ్గరా డబ్బులు వసూలు చేయాలని తమకు ఎంత మాత్రం ఉద్దేశం లేదని.. కానీ రాజా పాటల్ని వాడుకుని లక్షలు లక్షలు సంపాదిస్తున్న వారి మీదే తమ దృష్టి అని ప్రదీప్ అన్నాడు.

విదేశాల్లో మ్యూజికల్ కన్సర్ట్‌ల పేరుతో లక్షలు లక్షలు ఆదాయం ఆర్జిస్తున్నారని.. కానీ ఇళయరాజా పాటల్ని వాడుకుంటూ ఆయనకు ఒక్క రూపాయి కూడా చెల్లించట్లేదని.. ఇదెక్కడి న్యాయమని అతను ప్రశ్నించాడు. తన పాటల్ని తన అనుమతి లేకుండా ఉపయోగించద్దని ఇళయరాజా ఇంతకుముందే ఒకటికి రెండు ప్రెస్ నోట్లు ఇచ్చారని.. వాటిని విస్మరించి సంగీత కచేరీల్లో ఆయన పాటల్ని ఇష్టానుసారం వాడుతున్నారని ప్రదీప్ తెలిపాడు. బాలు ఏమీ ఛారిటీ షోలు చేయట్లేదని.. సంగీత కచేరీలతో భారీగా ఆర్జిస్తున్నారని.. కనీసం ఆయన ఇళయరాజాతో మాట్లాడి అనుమతి తీసుకోవాల్సిందని ప్రదీప్ అన్నాడు.


Recent Random Post: