
ప్రముఖ సినీ నటికి ఐటీ శాఖ నుంచి చిక్కులు తీరటం లేదు. ఆదాయపన్ను శాఖతో ఆమె పంచాయితీ ఒక కొలిక్కి రావటం లేదు. తనకు విధించిన రూ.1.15కోట్ల జరిమానాపై న్యాయపోరాటం చేస్తున్న త్రిషకు ఊరట లభించినట్లే లభించి.. మళ్లీ అప్పీలు చిక్కులు ఎదురయ్యాయి.
మొన్నామధ్య ట్రైబ్యునల్ తీర్పుతో ఐటీ చిక్కుల నుంచి బయటపడినట్లు కనిపించిన త్రిష.. తాజాగా ఐటీ శాఖ అప్పీలుకు వెళ్లటంతో ఆమెకు ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. ఇంతకీ జరిగిందేమిటంటే.. 2010-11 సంవత్సరానికి సంబంధించి తన ఆదాయం రూ.89 లక్షలంటూ త్రిష రిటర్నులు దాఖలు చేసింది.
అయితే.. సినిమాల్లో నటించేందుకు తీసుకున్న అడ్వాన్సుల్ని ఈ ఆదాయానికి జత చేయలేదు. దీనిపై ఐటీశాఖ దృష్టి సారించి ఆమెకు రూ.1.15కోట్ల జరిమానాను విధించింది. అడ్వాన్సులు కూడా ఆదాయం కిందకే వస్తాయని స్పష్టం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే.. ఐటీశాఖ నిర్ణయాన్ని త్రిష తీవ్రంగా తప్పు పడుతూ.. న్యాయం కోసం ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. ఈ కేసును పరిశీలించిన ట్రైబ్యునల్ త్రిషకు అనుకూలంగా తీర్పు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. ఊపిరి పీల్చుకున్న త్రిషకు షాకిస్తూ..తాజాగా ఐటీ శాఖ ఈ తీర్పుపై మద్రాస్ హైకోర్టుకు అప్పీలుకు వెళ్లింది.
ఈ కేసు వివరాలను పరిశీలించిన హైకోర్టు.. విచారణకు స్వీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. వదిలిపోయిందనుకున్న ఐటీ కేసు మళ్లీ త్రిషను చుట్టుకుందన్న మాట వినిపిస్తోంది.
Recent Random Post: