
2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు ఆంధ్రా రాజకీయాలలో కలకలం రేపుతుంది అనుకున్న నంద్యాల శాసనసభ ఉప ఎన్నికల ఫలితం అధికార పక్షానికి ఆనందాన్ని, విపక్షానికి నైరాశ్యాన్ని నింపింది. లడ్డూ లాంటి అవకాశాన్ని ప్రణాళిక లేకుండా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన తప్పటడుగులే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మానసిక స్థయిర్యం దెబ్బతినడానికి కారణం అని సొంత పార్టీ కార్యకర్తలే అంటున్నారు.
ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు పాలన మీద ప్రజలకు అసంతృప్తి ఉందన్నది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు రెండో మారు ఆలోచించకుండా చెప్పే మాట. నంద్యాల ఎన్నికల రూపంలో జగన్ కు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఓ అవకాశం వచ్చింది. దానిని తనను అనుకూలంగా మలుచుకోవడంలో జగన్ విఫలమయ్యాడని అంటున్నారు. ముఖ్యంగా అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డిని ఎంచుకోవడంలోనే జగన్ విఫలమయ్యాడని చెబుతున్నారు. మొన్నటిదాకా శిల్పా జగన్ ను తిడుతూ తిరిగిన వ్యక్తి. టీడీపీ నుండి టికెట్ రాకపోవడంతో అధికార దాహంతోనే పార్టీ మారాడని స్థానికులు భావిస్తున్నారు.
ఇక టీడీపీలో ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. జగన్ దానికి రాజీనామా చేయించినా ఇచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడని ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అవతలి నుండి భూమా నాగిరెడ్డి మరణంతో ఆయన సోదరుడి కుమారుడికి పోటీకి అవకాశం దక్కింది. అతని తండ్రి కూడా ఒకప్పుడు ఎమ్మెల్యే. అనుకోని అవకాశం ఆ యువకుడికి దక్కిందని ప్రజలు అటు మొగ్గు చూపినట్లు ఎన్నికల సరళిని బట్టి తెలుస్తుంది.
ఈ పరిస్థితులలో ఉన్న ఎన్నికను జగన్ తనకు, చంద్రబాబు నాయుడుకు మధ్య జరుగుతున్న ఎన్నికగా భావించుకోవడం పెద్ద పొరపాటని అంటున్నారు. ఇక 13 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ జగన్ పక్కన శిల్పా మోహన్ రెడ్డిని కేవలం ప్రజలకు నమస్కరించడానికి పరిమితం చేసి నన్ను చూసి ఓటేయ్యండి అంటూ చెప్పడాన్ని ప్రజలు స్వాగతించలేదని అర్ధం అవుతుంది. స్థానికుడు, మాజీ మంత్రి అయిన తన పార్టీ అభ్యర్థిని ప్రజలతో ఏమీ మాట్లాడనివ్వకుండా జగన్ తనను తాను ఎక్కువగా ఊహించుకుని తాను పంతం పడితే ఎవరయినా ఓడిపోతారని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్లడమే కొంప ముంచిందని అంటున్నారు. నంద్యాల ఎన్నికను సమీక్షించుకుని తప్పును సరిదిద్దుకోకుంటే జగన్ భవిష్యత్ కు ముప్పు తప్పదు.
Recent Random Post:

















