బిచ్చగాడు టైటిల్ తీసేయమన్నారు.. థియేటర్లు ఇవ్వనన్నారు

భిన్నమైన సినిమాల్ని అందించేందుకు తపించే కొద్ది మంది నటుల్లో విజయ్ ఆంటోని ఒకరు. కొన్నేళ్ల క్రితం బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రజలకు పరిచయం కావటమే కాదు సుపరిచితుడిగా మారాడు. అతడి నుంచి సినిమాలు వస్తున్నాయంటే చాలు.. కథ భిన్నంగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. సూపర్ హిట్ సాధించిన బిచ్చగాడు పేరుతో బిచ్చగాడు2 మూవీని తీస్తున్నారు. అయితే.. ఇది బిచ్చగాడు మూవీకి స్వికెల్ ఎంతమాత్రం కాదని స్పష్టం చేస్తున్నారు.

త్వరలో విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తన గురించి.. తన నేపథ్యం గురించి.. సూపర్ హిట్ అయిన బిచ్చగాడు మూవీ విడుదలకు ముందు తాను ఎదుర్కొన్న సమస్యల గురించి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.

బిచ్చగాడు మూవీ కథను శశి రాశారని.. అతడే సినిమాకు దర్శకత్వం వహించిన విషయాన్ని గుర్తు చేశారు. తాను కేవలం నిర్మాతను మాత్రమేనని.. ఆ సినిమా కథ విన్నంతనే అందులో తనకొక హీరోయిజం కనిపించిందన్నారు. ‘కథ విన్నంతనే అడ్వాన్సు ఇచ్చేశాను. కథ బాగా నచ్చింది.

కానీ..బిచ్చగాడు టైటిల్ పెట్టటంపై ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత వచ్చింది. కొంత మంది ఇండస్ట్రీకి చెందిన వారు నన్ను కలిసి ఆ టైటిల్ తీసేయాలన్నారు. కొంతమంది థియేటర్ యజమానులు తమ సినిమా థియేటర్లను ఇవ్వటానికి ఒప్పుకోలేదు. అయితే.. నేను కంటెంట్ ను నమ్మాను. దానికి అనుగుణంగా టైటిల్ ను అలానే ఉంచాను. బిచ్చగాడు 2 దానికి సీక్వెల్ కాదు” అని పేర్కొన్నారు.

కథకు అనుగుణంగానే బిచ్చగాడు 2 టైటిల్ పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ కథను తానే రాసుకున్నానని.. తానే దర్శకుడిగా.. నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలకు డబ్బే ప్రధానకారణమని.. కొంతమంది ధనికులు లేనివాళ్లను బానిసలుగానే చూస్తుంటారని.. అందుకే బిచ్చగాడు 2లో డబ్బు గురించే ఎక్కువగా చూపించినట్లు పేర్కొన్నారు. ప్రేక్షకులు తనను నటుడిగా కంటే కూడా వ్యక్తిగానే ఇష్టపడుతుంటారన్నారు. ఇదంతా తాను ఎంచుకున్న కథలతోనే సాధ్యమైందని చెప్పారు.


Recent Random Post: