
బీకాంలో ఫిజిక్స్ చదివాను అనే ఒక్క డైలాగ్ తెలుగువారందరికీ తెలిసిపోయిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తాజాగా మరోమారు అదే తరహా కామెంట్లు చేశారు. అయితే ఈ దఫా కేవలం తన ఒక్కడి సత్తా గురించే కాకుండా తనను అక్కున చేర్చుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టాలెంట్ గురించి ఓ రేంజ్ లో చెప్పేశారు. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో తాను పవన్‌పై విజయం సాధించబోతున్నట్లు ప్రకటించేశాడు జలీల్ ఖాన్.
తాజాగా జలీల్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికు భయపడే తాను రాజీనామా చేయడం లేదనే ప్రచారం సరికాదన్నారు. ఎన్నికలంటే తనకు అస్సలు భయం లేదని, తాను ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసినా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కనుక విజయవాడలో పోటీచేస్తే ఆయనపై మెజారిటీ ఓట్లతో తానే గెలుస్తానని జలీల్ ఖాన్ ధీమా వ్యక్తం చేశారు. కనీసం పది ఓట్లతో అయినా పవన్ కళ్యాణ్‌పై తన విజయం ఖాయమని ఆయన భరోసాగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు నాయుడుకు వచ్చే ఆలోచనలు మరెవరికీ రావన్నారు. అడవిలో కూడా అసెంబ్లీ కట్టారని ప్రశంసలు గుప్పించారు. అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు తరువాతేనని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు కేబినెట్లో చోటు లభిస్తుందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తనకు మంత్రి పదవి వస్తుందో లేదో తెలియదని జలీల్ ఖాన్ తెలిపారు. మంత్రిగా ఉండటం కంటే ఎమ్మెల్యేగా ఉండటమే చాలా మంచిదన్నారు.
తనదైన శైలిలో జలీల్ ఖాన్ కామెంట్లు చేసి వదిలేసినప్పటికీ ఇటు మిత్రపక్షమైన బీజేపీని, గత ఎన్నికల్లో బంపర్ మెజార్టీ వచ్చేందుకు కారణమైన పవన్ కళ్యాణ్‌ను ఇరకాటంలో పడేసే విధంగా ఉండటం ఏమిటని తెలుగుదేశం శ్రేణుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జలీల్ ఖాన్ వ్యాఖ్యలు కామెడీగా ఉండటంతో పాటు అవి ట్రాజెడీగా మారుతున్నాయని అంటున్నారు.
Recent Random Post: