ముంబ‌యిలో పాప్ సంచ‌ల‌నం హ‌డావుడి ఎంతంటే?

వ‌య‌సులో చిన్నోడే కానీ.. ప్ర‌పంచ యువ‌త‌ను త‌న సంగీతంలో పిచ్చెక్కించే కెన‌డియ‌న్ పాప్ స్టార్ జ‌స్టిస్ బీబ‌ర్ తొలిసారి ఇండియాకు వ‌చ్చాడు. ఇత‌గాడి కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యువ‌త‌.. ఇత‌డి ప‌ర్య‌ట‌న క‌న్ఫ‌ర్మ్ అయిన నాటి నుంచి ఇత‌డి రాక కోసం ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. త‌న పాట‌తో భార‌తీయుల్ని ఉర్రూత‌లూగించేందుకు బీబ‌ర్ మూడు రోజులు భార‌త్‌లో ఉండ‌నున్నారు.

మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత ముంబ‌యి ఎయిర్ పోర్ట్‌కు బీబ‌ర్ చేరుకున్నాడు. త‌న ప్రైవేట్ జెట్‌లో ఇండియాకు వ‌చ్చిన ఇత‌గాడికి భారీగా స్వాగ‌తం చెప్పేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జ‌రిపారు. అర్థారాత్రి ఒంటిగంట వేళ‌లో ముంబ‌యిలోకి అడుగు పెట్టిన ఇత‌డికి.. అభిమానులు పెద్ద ఎత్తున స్వాగ‌తం ప‌లికారు.

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షెరా.. బీబ‌ర్ కు వ్య‌క్తిగ‌త సెక్యూరిటీ గార్డుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అంతే కాదు.. స‌ల్మాన్ వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బంది బీబ‌ర్‌కు సెక్యూరిటీగా ఉండ‌నున్నారు. ఎయిర్ పోర్ట్‌లోకి ల్యాండ్ అయిన వెంట‌నే.. అత‌డికి పూల‌బొకేలు ఇస్తూ అత‌డి చుట్టూ గుమిగూడారు. ఎయిర్ పోర్ట్ నుంచి ప్ర‌త్యేక రోల్స్ రాయిస్ కారులో లోవ‌ర్ ప‌రెల్ హోట‌ల్‌కు చేరుకున్నారు. ప్ర‌పంచ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బీబ‌ర్ ఇండియాకు వ‌చ్చారు. ఈ రోజు రాత్రి 8 గంట‌ల వేళ‌.. డీవై ప‌టేల్ స్టేడియంలో ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌నున్నారు.

త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బీబ‌ర్ ముంబ‌యి.. ఢిల్లీ.. అగ్రా.. జైపూర్‌ల‌ను సంద‌ర్శించ‌నున్నాడు. బాలీవుడ్ దిగ్గ‌జ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించే కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో బీబ‌ర్ పాల్గొన‌నున్నాడు. అంత‌ర్జాతీయ సెల‌బ్రిటీ అయిన బీబ‌ర్ ఇండియా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌త్యేక భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. బీబ‌ర్ కోసం ఢిల్లీ.. ముంబ‌యిల‌లోని ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌లో ప్ర‌త్యేక సూట్ల‌ను సిద్ధం చేశారు. బీబ‌రా మ‌జాకానా?


Recent Random Post: