మరో మెగా చిన్నల్లుడితో బుచ్చిబాబు

మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ తో ఉప్పెన సినిమాను తెరకెక్కించిన సుకుమార్‌ శిష్యుడు బుచ్చి బాబు సూపర్‌ సక్సెస్‌ ను దక్కించుకున్నాడు. ఉప్పెన సినిమా తర్వాత ఆయన ఏకంగా ఎన్టీఆర్‌ నుండి ఆఫర్‌ ను అందుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే జోరుగా ప్రచారం జరిగింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ తో కాకుండా మళ్లీ మెగా హీరోతోనే ఈయన సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మెగా కాంపౌండ్‌ చేసిన సిఫార్సుతో బుచ్చి బాబు మళ్లీ మెగా మూవీ చేయబోతున్నాడు.

ఉప్పెనతో చిరంజీవి మేనల్లుడిని వెండి తెరకు పరిచయం చేసిన బుచ్చి బాబు ఈసారి మెగాస్టార్ చిన్న కూతురు భర్త కళ్యాణ్‌ దేవ్‌ కు సక్సెస్‌ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే విజేత సినిమాతో హీరోగా ఈయన పరిచయం అయ్యాడు. ఇటీవలే సూపర్ మచ్చి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఇక మూడవ సినిమా గా బుచ్చి బాబు దర్శకత్వంలో చేసేందుకు కళ్యాణ్‌ దేవ్‌ సిద్దం అయ్యాడు. కళ్యాణ్‌ దేవ్‌ కోసం ఒక కథను కూడా బుచ్చి బాబు రెడీ చేయడం మెగా స్టార్ ఓకే చెప్పడం జరిగిందట. మొత్తానికి బుచ్చి బాబు రెండవ సినిమా దాదాపుగా కన్ఫర్మ్‌ అయినట్లే అంటున్నారు.