Karthika Deepam Serial 24th January Episode Online 2020

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 712 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 713 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (జనవరి 24) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…

విడాకులు తీసుకోవడం లేదని, హిమకు మాటిచ్చానని చెప్పడానికి మౌనిత ఇంటికి వెళ్తాడు కార్తీక్. విషయం చెప్పిన తర్వాత హిమ కాల్ చెయ్యడంతో.. ‘మౌనిత దగ్గర ఉన్నాను అని కాకుండా.. ‘నేనా.. నేను అర్జెంట్ కేసు ఉంటే చూడటానికి వచ్చాను. వచ్చేస్తాను..’ అని చెప్పి బయలుదేరతాడు. అప్పటికే రగిలిపోతున్న మౌనిత.. ‘కార్తీక్…’ అని గట్టిగా పిలిచి.. ‘నువ్వు ఇక్కడున్నప్పుడు మీ వాళ్లు ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడిగితే మౌనిత ఇంట్లో ఉన్నానని చెప్పగలిగిన రోజే నువ్వు ఇక్కడికి రా కార్తీక్. అంత వరకూ రావాల్సిన అవసరం లేదు. ఇక వెళ్లు కార్తీక్.’ అంటుంది ఆవేశంగా.. కార్తీక్ ఆ మాటలకు కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

అమ్మా బాధపడుకు..

హిమ కారణంగా విడాకులు ఆగిపోవడంతో.. దీప ఆనందంగా సౌర్య కోసం చక్కెర పొంగలి చేస్తాను.. అంటుంది. గ్యాస్ అయిపోవడడంతో.. దీప చిన్న పిల్లలా సౌర్య వైపు కొంటెగా చూస్తూ, నవ్వుతూ.. ‘గ్యాస్ ఇల్లే.. గ్యాస్ అయిపోయింది.. వంటలక్క ముఖానికి చక్కెర పొంగలి ఒకటి.. అనవసరంగా నీకు ఆశపెట్టాను పాపిస్టిదాన్ని’ అంటూ తనని తాను తిట్టుకుంటుంది దీప. ఆ మాటలకు సౌర్య.. దీపని పట్టుకుని ‘అమ్మా బాధపడుకు. నువ్వు హ్యాపీగా ఉన్నావ్‌గా అది చాలు’ అంటుంది.

అమ్మ గడుగ్గాయి..

ఇంతలో మురళీ కృష్ణ.. ఓ బాక్స్ తీసుకుని ‘అమ్మా దీపా’ అంటూ వస్తాడు. ఆ పిలుపుకి పరుగున వెళ్లిన దీప.. ‘నాన్నా.. అని పిలవాలో లేదో.. సౌర్యకు నిజం తెలియాలో లేదో అన్న అనుమానంతో.. నా..’ అని ఆగిపోతుంది. అది గమనించిన సౌర్య.. ‘బాగున్నారా అమ్మా దీపా తాతయ్యా?’ అంటూ పలకరిస్తుంది. ‘అదేం పేరే?’ అంటాడు మురళి కృష్ణ ఆశ్చర్యంగా.. ‘మీరు నన్ను అలానే పిలుస్తారుగా అదే పేరు మీకు పెట్టేసింది’ అంటుంది దీప నవ్వుతూ.. ‘అమ్మ గడుగ్గాయి’ అంటూ సౌర్యని ముద్దు చేస్తాడు మురళీ కృష్ణ.

చాలా సంతోషం అమ్మా..

తనను భాగ్యం చేత చెయ్యించుకొచ్చిన.. గారెలు, చికెన్ కూర తినమంటూ దీపకు, సౌర్యకు పెడతాడు. ఇద్దరూ తింటారు. సౌర్య బయటికి వెళ్లిన కాసేపటిలో.. ‘అమ్మా విడాకులు విషయం తెలిసే ఏదో వంక అని ఇలా వచ్చేశానమ్మా’ అంటూ సంబరపడిపోతాడు మురళీ కృష్ణ. సౌర్య రావడంతో.. ‘రా అమ్మా’ అంటూ ముద్దు చేసి 5 వందలు చేతిలో పెట్టి ఏమైనా కొనుక్కోమ్మా అంటూ ఇస్తాడు. ‘అమ్మో 5 వందలా? వద్దు తాతయ్యా’ అంటుంది సౌర్య. మురళి కృష్ణ నచ్చజెప్పడంతో తీసుకుంటుంది.

దేవుడిచ్చిన తమ్ముడు..

ఇంతలో వారణాసి గ్యాస్ సిలెండర్ తీసుకొచ్చి పెడతాడు. ‘ఈ విషయం నీకు ఎలా తెలుసు?’ అంటే.. సౌర్యమ్మే వాయిస్ మెసేజ్ పెట్టింది అక్కా.. అరగంటలో గ్యాస్ సిలెండర్ ఉండాలని’ అంటాడు వారణాసి అమాయకంగా ముఖం పెట్టి. వారణాసిని చూసిన మురళీ కృష్ణ.. మనసులో.. ‘ఈ వారణాసీ నా కూతురికి ఆ దేవుడిచ్చిన తమ్ముడు’ అనుకుంటాడు సంబరంగా..

ఏం సుపుత్రా?

కార్తీక్ మౌనిత మీద కోపంతో ఇంటికి వస్తాడు. సౌందర్య వెటకారంగా.. ‘ఏం సుపుత్రా? పొద్దుపొద్దున్నే ఏ మూసీనది వెంట వెళ్లావు వాకింగ్‌కి?’ అంటుంది హిమకు అర్థం కాకూడదనే ఉద్దేశంతో.. అయితే కార్తీక్ మౌనిత మాటలు తలుచుకుంటాడు. ‘నువ్వు ఇక్కడున్నప్పుడు మీ వాళ్లు ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడిగితే మౌనిత ఇంట్లో ఉన్నానని చెప్పగలిగిన రోజే నువ్వు ఇక్కడికి రా కార్తీక్. అంత వరకూ రావాల్సిన అవసరం లేదు’ అన్న మౌనిత మాటలు గుర్తు చేసుకుంటూ.. ‘మౌనిత ఇంటికి వెళ్లి వస్తున్నాను మమ్మీ’ అంటాడు కోపంగా..

హిమ డౌట్.. కార్తీక్ ఫైర్..

అది విన్న హిమ కోపంతో.. ‘పొద్దున్నే ఆమె ఇంటికి ఎందుకు డాడీ?’ అంటుంది. ‘నీ వయసుకి తగ్గ ప్రశ్నలు వెయ్యి హిమా’ అంటూ కోప్పడతాడు కార్తీక్. వెంటనే మళ్లీ తనే మాట్లాడుతూ.. ‘అయినా నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేశావ్?’ అంటాడు హిమని. ‘ఆమె ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు ఫోన్ చెయ్యకూడదని నాకు తెలియకూడదు కదా డాడీ..?’ అంటుంది అమాయకంగా ముఖం పెట్టి.

అనుకున్నట్లే అన్నీ జరుగుతున్నాయి కదా మమ్మీ?

హిమ ప్రశ్నకు సౌందర్య నవ్వుతుంది. ‘చెప్పు సుపుత్రా.. నీ కూతురు దాని వయసుకు తగ్గట్టే అడిగింది’ అంటూ వెటకారం చేస్తుంది. ‘బయటికి వెళ్లినప్పుడు పనులు ఉంటాయి కదమ్మా’ అంటూ కూల్ అయిపోయి కవర్ చేస్తాడు కార్తీక్. ‘అయినా నువ్వు అనుకున్నట్లే అన్నీ జరుగుతున్నాయి కదమ్మా మమ్మీ.. ఇప్పుడు ఎందుకు ఈ రచ్చ’ అంటూ ఆవేశంగా లోపలికి వెళ్లిపోతాడు కార్తీక్.

చూశారా ఈ పొట్టి బుడంకాయ..

దాంతో సౌందర్య ‘హిమా.. మీ నాన్నకు ఇప్పటికి ఈ డోస్ చాలు. నువ్వు ఎప్పుడు మళ్లీ కొత్త అమ్మ గురించి అడగాలో నేను చెబుతాను’ అంటుంది. వెంటనే హిమ.. నవ్వుతూ.. ‘నాన్నమ్మా నీకు మా డాడీ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అసలు మా డాడీనే నీకు ఇష్టం ఉండరు అనుకున్నాను’ అంటూ బాంబ్ పేల్చి వెళ్లిపోతుంది పైకి. హిమ మాటలకు సౌందర్య నొచ్చుకుంటుంది. ‘చూశారా ఈ పొట్టి బుడంకాయ.. నన్ను ఎంత మాట అందో’ అంటూ బాధపడుతుంది.

అదంతా సరే కానీ..

ఆనందరావు కూల్ చేస్తాడు. వెంటనే సౌందర్య ‘ఆ మౌనితని ఊరికే వదిలిపెట్టకూడదండీ.. దాన్ని అసలు’ అంటూ కోపాన్ని అనుచుకుంటూ.. ఆనందరావు చెవి దగ్గరకు వెళ్లి.. ‘అదంతా సరే కానీ.. ఈ పొట్టి బుడంకాయకి వంటలక్కే మీ అమ్మ.. అని చెప్పేస్తే.. కార్తీక్‌తో కలిపే పని అదే చూసుకుంటుందేమో?’ అంటూ నవ్వుతుంది సౌందర్య. ఆనందరావు కూడా నవ్వుతాడు.

చార్మినార్ వెళ్దామా?

సౌర్య స్కూల్ వెళ్లను అంటుంది. ‘చార్మినార్ వెళ్దామా..? నా దగ్గర 5 వందలు ఉంది..’అంటూ బిల్డప్ కొడుతుంది. ఇంతలో వారణాసి వచ్చి.. ‘అయ్యో సౌర్యమ్మా.. ఇంకా రెడీ కాలేదా.’ అంటాడు. ‘స్కూల్‌కి వెళ్లనురా..’ అంటుంది సౌర్య. ‘పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదమ్మా.. చదువుకుంటే కలెక్టర్ అవుతావు. లేదంటే..’ అంటాడు వారణాసి.. ‘నీలా అవుతానా?’ అంటూ పంచ్ వేస్తుంది సౌర్య. ‘అమ్మా మనం చార్మినార్ వెళ్దామా’ అంటుంది మళ్లీ దీపతో..

కమింగ్ అప్‌లో..

స్కూల్‌లో దీప, సౌర్య, సౌందర్య, హిమ కలుస్తారు. బాక్స్‌లు ఇచ్చిన తర్వాత సౌర్య హిమతో.. ‘నా దగ్గర 5 వందలు ఉన్నాయి.. చార్మినార్ వెళ్లి.. మా అమ్మకు చేతుల నిండా గాజులు వెయ్యించి వస్తాను. నీకు ఏమైనా కావాలా?’ అంటూ గొప్పగా అడుగుతుంది. అది విన్న సౌందర్య.. దీపని పక్కకు తీసుకుని వెళ్లి కూర్చోబెట్టి.. ‘ఏంటీ ఈ కర్మా.. 5 వందల్ని అంత గొప్పగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏంటీ మీకు? నెలకి లక్ష పంపిస్తాను.. నా మాట కాదనకు దీపా’ అంటుంది బాధతో.. దీప మాత్రం వెర్రి నవ్వు నవ్వి.. ‘భర్త విడాకులు ఇవ్వను అని వదిలేస్తే.. అత్త భరణం కింద డబ్బులు పంపిస్తుందా?’ అంటుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.. ‘కార్తీకదీపం’ కొనుసాగుతోంది.