
పవర్ ఫుల్ స్థానాల్లో ఉన్న వారికి అత్యంత సన్నిహితుల తీరు నచ్చినా.. నచ్చకున్నా చాలామంది గమ్మున ఉంటారే తప్పించి వారిపై కంప్లైంట్ చేసేందుకు ఏ మాత్రం ఇష్టపడరు. ఇక.. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు.. ఆయనకు ఆరోప్రాణం లాంటి అమిత్ షాపై ఎవరైనా ప్రధానికి ఫిర్యాదు చేసే సాహసం చేస్తారా? అంటే లేదనే చెబుతారు. కానీ.. ఆ పనిని పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.
తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో భేటీ అయిన కేసీఆర్.. అమిత్ షా పై కంప్లైంట్ చేసినట్లు సమాచారం. ఇటీవల అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడే ఏవేవో మాట్లాడారని.. తెలంగాణకు అన్ని కోట్లు ఇచ్చినాం.. ఇన్ని కోట్లు ఇచ్చినామంటూ తప్పుడు లెక్కలు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అమిత్ షాపై మోడీకే కంప్లైంట్ ఇవ్వటానికి కొద్ది గంటల ముందు.. తానే స్వయంగా అమిత్ షాను పలుకరించారు కేసీఆర్. రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన సందర్భంగా తన ముందు వరుసలో కూర్చున్న అమిత్ షా ను వెనుక నుంచే పలుకరించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాంటి కేసీఆర్.. ప్రధాని మోడీని కలిసినప్పుడు మాత్రం ఆయనపై ఫిర్యాదు చేసేందుకు వెనుకాడలేదని చెబుతున్నారు.
కేంద్రానికి తెలంగాణ సుమారురూ.52వేల కోట్లు పన్నుల రూపంలో ఇస్తుంటే.. కేంద్రం తిరిగి సుమారు రూ.25వేల కోట్లు మాత్రమే ఇస్తుందని.. ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వటం లేదని మోడీకి కేసీఆర్ లెక్కలు చెప్పినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ మాటలకు మోడీ సర్దిచెప్పినట్లుగా సమాచారం. తెలంగాణ రాష్ట్ర పర్యటన తర్వాత అమిత్ షా తన వద్దకు వచ్చారని.. తాను అలా మాట్లాడలేదని తనకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రధానికి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా మీదనే కేసీఆర్ కంప్లైంట్ చేయటం సంచలనంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Recent Random Post: