అసలెవడండీ ఈ సంకల్ప్?

ఇటు తెలుగులో.. అటు తమిళంలో.. మరోవైపు హిందీలో… మూడు ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశమవుతోంది ‘ఘాజీ’ సినిమా. ఇలాంటి భారీ సినిమాను ఇంత పకడ్బందీగా తీసిన దర్శకుడు ఎవరా అని అందరూ చర్చించుకుంటున్నారు. సంకల్ప్ గురించి ఆరాలు తీస్తున్నారు. అతనో కొత్త దర్శకుడని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. నిండా ముప్ఫై ఏళ్లు కూడా లేకుండా.. ఒక సినిమా కూడా తీసిన అనుభవం లేకుండా.. ‘ఘాజీ’ లాంటి గొప్ప సినిమాను అతను తీర్చిదిద్దిన తీరు పేరున్న దర్శకుల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

సబ్ మెరైన్ గురించి.. నీటిలోపలి యుద్ధాల గురించి.. నేవీ గురించి.. 1971 నాటి ఇండో-పాక్ యుద్ధం ముందు పరిస్థితుల గురించి సంకల్ప్‌కున్న అవగాహన.. అనేక కొత్త విషయాల్ని ఆసక్తికరంగా చెప్పిన తీరు.. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సినిమాను మలిచిన వైనం అందరినీ ఆకట్టుకుంటోంది. అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాజమౌళి.. క్రిష్‌ల తర్వాత జాతీయ స్థాయిలో అంత చర్చనీయాంశమవుతున్న తెలుగు దర్శకుడి పేరు సంకల్ప్‌దే.

చాలామంది కుర్రాళ్ల లాగే ఇంజినీరింగ్ పూర్తి చేసి.. ఆపై అమెరికాలో ఎమ్మెస్ చేసి.. అక్కడే నాలుగు రాళ్లు వెనకేసుకుని.. తర్వాత సినిమాలపై మోజుతో ఇండియాకు వచ్చేసిన కుర్రాడు సంకల్ప్. ‘కో అంటే కోటి’ లాంటి ఒకట్రెండు సినిమాలకు అసిస్టెంట్‌గా పని చేసి.. ఆపై సొంతంగా సినిమాలు తీసే ప్రయత్నాల్లో భాగంగా షార్ట్ ఫిల్మ్స్ మొదలుపెట్టాడు.

అనుకోకుండా విశాఖపట్నంలో సబ్ మెరైన్ చూసి.. దాని మీద ఆసక్తితో చాలా విషయాలు తెలుసుకుని.. ఈ నేపథ్యంలో ‘బ్లూ ఫిష్’ అనే పుస్తకం రాసి.. తర్వాత ఆ కథతో సొంత డబ్బులు పెట్టి షార్ట్ ఫిల్మ్ తీయడానికి సిద్ధమై.. దాని గురించి రానా, పీవీపీలకు తెలిసి, వాళ్లు ‘ఘాజీ’ కథను సినిమాగా చేయడానికి అవకాశం కల్పిస్తే  దాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని ఇండియన్ ఆడియన్స్ అందరూ గర్వించే స్థాయిలో సినిమా తీశాడు సంకల్ప్. అదీ అతడి కథ.


Recent Random Post: