క్రిష్‌ ఎంత భయపడిపోయాడో చూడండి

దర్శకుడు క్రిష్ మామూలుగా వివాదాలకు దూరంగా ఉంటాడు. అందరు హీరోలతోనూ అతను సఖ్యతతో మెలుగుతాడు. ఐతే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో వేడుకలో క్రిష్  మాట్లాడుతూ.. ‘ఖబడ్దార్’ అనే మాట వాడటం వివాదాస్పదమైంది.

తమ సినిమాకు పోటీగా వస్తున్న ‘ఖైదీ నెంబర్ 150’ని ఉద్దేశించి క్రిష్ ఆ వ్యాఖ్యలు చేశాడంటూ ప్రచారం జరగడంతో క్రిష్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. దాని మీద మళ్లీ మళ్లీ అతను వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయినా వివాదం పూర్తిగా సద్దుమణగలేదు. దీంతో క్రిష్ ఓ దశలో అసహనం కోల్పోయాడు. చివరికి ఎలాగోలా ఆ గొడవకు తెరపడ్డా.. దాని తాలూకు ప్రభావం మాత్రం క్రిష్‌ను వీడినట్లు లేదు.

తాజాగా ఐఫా అవార్డుల వేడుకకు భార్యతో కలిసి హాజరయ్యాడు క్రిష్. ఈ సందర్భంగా ఈ జంటను మీడియా వాళ్లు ఇంటర్వ్యూ చేశారు. క్రిష్ భార్య రమ్యను మీకు నచ్చిన దర్శకుడెవరు అని యాంకర్ అడిగితే.. క్రిష్ అందుకుని నేనే అని బదులిచ్చాడు. ఆ తర్వాత ఆమెను మీకు నచ్చిన హీరో ఎవరు అని అడిగితే.. అప్పుడు కూడా క్రిష్ జోక్యం చేసుకుని ‘నేనే’ అన్నాడు.

నిజానికి రమ్యకు ఇద్దరు ముగ్గురు హీరోలంటే ఇష్టమని.. కానీ వాళ్ల పేర్లు చెబితే.. మిగతా హీరోలు కొడతారేమో అని భయమని.. అందుకే వాళ్ల పేర్లు చెప్పనివ్వట్లేదని క్రిష్ చమత్కరించాడు. క్రిష్ సరదాగా ఆ మాట అన్నా.. తెలుగులో ఫ్యాన్ వార్స్ గురించి క్రిష్ ఎంతగా భయపడుతున్నాడో ఈ సంఘటన చాటిచెబుతుంది.