టీఆర్ఎస్ నేత‌ల‌ను ఏకేసిన కేటీఆర్‌

అవును మీరు క‌రెక్టుగానే  చ‌దివారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, టీఆర్ఎస్ మంత్రి అయిన కేటీఆర్ త‌న సొంత పార్టీ నేత‌ల‌పై మండిప‌డ్డారు. ఇంకో సారి ఇలా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుందని కూడా హెచ్చ‌రించారు. ఈ మేర‌కు సంబంధిత వ‌ర్గాల‌కు ఆదేశాలు జారీచేశారు. కేటీఆర్‌ ఇంత‌గా ఫైర్ అయిపోయేలా టీఆర్ఎస్ నాయ‌కులు ఏం చేశారంటే…కేటీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌డ‌మే! ఓ రేంజ్‌లో త‌న ఫ్లెక్సీల‌ను చూసి కేటీఆర్‌కు కాలిపోయింది మ‌రి.

పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి మంత్రి బాధ్యుడిగా ఉన్న కేటీఆర్ సికింద్రాబాద్‌లోని కంటోన్‌మెంట్‌ బాపూజీనగర్‌లో ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. రూ.1.5కోట్లతో నిర్మించిన నూతన వంతెనను స‌హ‌చ‌ర‌ మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్‌లతో క‌లిసి ప్రారంభించేందుకు కేటీఆర్ అక్క‌డికి చేరుకున్నారు. అయితే కేటీఆర్‌ పర్యటన సందర్భంగా స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలు పెద్ద ఎత్తున‌ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో మంత్రిగారికి మండిపోయింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దే క్ర‌మంలో ఫ్లెక్సీల ర‌హిత న‌గ‌రం కోసం తాను పిలుపునిస్తే అదేమీ ప‌ట్టించుకోకుండా ఎందుకు ఇలా చేశార‌ని కేటీఆర్‌ నిల‌దీశారు. మరొకసారి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కంటోన్మెంట్ సీఈఓను కేటీఆర్ ఆదేశించారు.

కాగా, బ్రిడ్జీ ప్రారంభోత్సం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో కృషి చేస్తున్న‌ద‌ని తెలిపారు. ఇప్ప‌టికే న‌గ‌రంలో డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ను చక్కదిద్దినట్లు కేటీఆర్ వివ‌రించారు. రోడ్ల‌ను బాగు చేస్తున్నామ‌ని తెలిపారు. న‌గ‌రంలోని ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను, గోడ‌ల‌ను ప‌రిశుభ్రంగా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామ‌న్నారు. హైద‌రాబాద్ అభివృద్ధి ఒక్క ప్ర‌భుత్వం వ‌ల్లే జ‌ర‌గ‌ద‌ని పేర్కొంటూ ప్ర‌జ‌లంతా కలిసి వ‌స్తేనే అంద‌మైన హైద‌రాబాద్ క‌ల నెర‌వేరుతుందని కేటీఆర్ తెలిపారు.


Recent Random Post: