గుడి వద్దు, బడి వద్దు.. ‘మద్యం’ మాత్రమే ముద్దు.!

గుడికి వెళితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. బడికి వెళితే విద్యనభ్యసించవచ్చు. కానీ, ఇవేవీ ప్రస్తుతానికి వద్దు. ఎందుకంటే, కరోనా వైరస్‌ అనే మహమ్మారి పొంచి వుంది.. ఎవరు బయటకొచ్చినా కాటేయడానికి సిద్ధంగా వుంది.! మరి, మద్యం షాపుల దగ్గర ‘క్యూ’ కడితే కరోనా వైరస్‌ సోకదా.?

హిందూ దేవాలయాలు, ముస్లింల మసీదులు, క్రిస్టియన్ల చర్చిలు.. ఇవేవీ నలభై రోజులుగా భక్తులకు అందుబాటులో లేవు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధికే కరోనా ఎఫెక్ట్‌ పడింది. కానీ, మద్యం షాపుల్ని బార్లా తెరిచేశారు. ఇదే కదా అసలు సిసలు మహమ్మారి అంటే.

కరోనా వైరస్‌ దెబ్బకి ఆంధ్రప్రదేశ్‌లో 33 మంది చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. నిన్న ఒక్క రోజే మద్యం మహమ్మారి కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగానే తేటతెల్లమవుతోంది. అయినా, ఎందుకు ప్రభుత్వాలు మద్యం దుకాణాలపై ‘మోజు’ ప్రదర్శిస్తున్నాయట.? ఇదేమీ మిలియన్‌ డాలర్ల ప్రశ్న కాదు. ప్రజారోగ్యం కంటే, ప్రభుత్వాలకు ‘మద్యం’ ద్వారా వచ్చే ఆదాయం మీదనే ‘మోజు’ ఎక్కువ.

ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే కాదు, కరోనా పాజిటివ్‌ కేసులు అత్యధికంగా వున్న ఢిల్లీ కావొచ్చు, మరో రాష్ట్రం కావొచ్చు.. ఇదే బాటలో నడుస్తున్నాయి. అసలు, మద్యం దుకాణాలు తెరవడానికి కేంద్రం ఎలా అనుమతులు ఇవ్వగలిగింది.? ఏ నైతికత.? ఏ ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం దుకాణాలు తెరిచాయోగానీ.. నలభై రోజులకు పైగా ప్రశాంతంగా వున్న భారతావని, ఇప్పుడు మద్యం కారణంగా మళ్ళీ సరికొత్త అలజడుల్ని ఎదుర్కోవాల్సి వచ్చేలా వుంది.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే, నిన్న ఒక్కరోజే మద్యం అమ్మకాల ద్వారా మొత్తం 60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో జరిగే అమ్మకాలతో దాదాపు సమానమిది. లాక్‌డౌన్‌ అమల్లో వున్నా, మద్యం బాబులు ఈ స్థాయిలో మద్యాన్ని ఎలా కొనుగోలు చేసినట్లు.? జనం ఛస్తే ఛావనీ.. ఖజానా నిండుతోందని ప్రభుత్వాలు సంబరపడితే, ఇక సంక్షేమ పథకాలు ఎందుకు.?

నెలకి వెయ్యి రూపాయల కరోనా సాయం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మద్యం ధరలేమో పెంచేసింది. అంటే, ఇలా ఇచ్చి.. అలా లాక్కోవడమే కదా.! అదేమని ప్రశ్నిస్తే, ‘మేమేమన్నా బలవంతంగా గుంజుకుంటున్నామా.? తాగడం మానెయ్యమని చెప్పండి.. మద్య నియంత్రణలో భాగంగానే రేట్లు పెంచాం..’ అని అధికార వైసీపీ చెబుతోంది. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్లుంది వ్యవహారం.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో 40 రోజులకు పైగా రాష్ట్రంలో అనధికారిక మద్య నిషేధం అమల్లో వున్నట్లే. ప్రభుత్వం ఆలోచన మద్య నిషేధమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెబుతున్న దరిమిలా, అనుకోకుండా కలిసొచ్చిన మద్య నిషేధానికి ప్రభుత్వమే తూట్లు పొడవడం హాస్యాస్పదం కాక మరేమిటి.?