‘కత్తి’ చేస్తానని చెప్పాను – మహేష్

మహేష్ బాబు రీమేక్ సినిమాలు చేయడానికి పూర్తి వ్యతిరేకం అన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో మహేష్ చాలాసార్లు స్టేట్మెంట్లు కూడా ఇచ్చాడు. ఐతే ఒక్క సినిమా విషయంలో మాత్రం మహేష్ తన పాలసీని పక్కనబెట్టాడట. ఓ రీమేక్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. ఆ సినిమా మరేదో కాదు.. కత్తి. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన సినిమా ఇది. దీన్నే చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రీమేక్ ముందు తన దగ్గరికే వచ్చిందని ఓ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ వెల్లడించాడు.

‘‘నిజానికి నాకు మొదటి నుంచి రీమేక్‌లపై ఆసక్తి లేదు. ఒక సినిమాని చూసి అదే కథలో నటించాలంటే ఉత్సాహం ఉండదు. షూటింగ్‌కి వెళ్లాలంటే ఏదైనా కొత్తగా అనిపించాలి. నా దగ్గరికి రెండు మూడు రీమేక్ ప్రపోజల్స్ వచ్చాయి. ‘కత్తి’ ముందు నా దగ్గరకే వచ్చింది. ఇది డైరెక్టర్స్ మూవీ. ఐతే మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తే చేస్తానని చెప్పాను. అప్పుడు ఆయన హిందీలో బిజీగా ఉన్నారు. దాంతో కుదరలేదు. మిగతా రీమేక్‌ల విషయంలో అసలేమాత్రం ఆసక్తి చూపించలేదు. బేసిగ్గా నేను రీమేక్‌లకు వ్యతిరేకిని’’ అని మహేష్ చెప్పాడు.

ఇక మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న ‘స్పైడర్’ గురించి మహేష్ చెబుతూ.. ‘‘‘శ్రీమంతుడులో నటిస్తున్నప్పుడు మురుగదాస్‌ వచ్చి గంటన్నర పాటు కథ చెప్పారు. విన్న వెంటనే ఓకే చెప్పేశాను. ఆ రోజు ఆయన ఏం చెప్పారో.. అలాగే స్ర్కీన్‌ మీద చూపిస్తున్నారు. అలాంటి సత్తా చాలా తక్కువ మంది దర్శకులకు మాత్రమే ఉంటుంది. ఆయన తీసిన ‘రమణ’, ‘కత్తి’ సినిమాలు ఒక ఎత్తు. ‘గజిని’, ‘తుపాకి’ మరో ఎత్తు. ఈ సినిమా రెండో కోవకి చెందినది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నాడు.


Recent Random Post: