కోవింద్… రాష్ట్ర‌ప‌తిగా గెలిచిపోయారుగా!

భార‌త నూత‌న రాష్ట్ర‌ప‌తిగా ఎన్డీఏ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన బీజేపీ సీనియ‌ర్ నేత‌, బీహార్ మాజీ గ‌వ‌ర్న‌ర్ రామ్ నాథ్ కోవింద్ గెలిచిపోయార‌ట‌. మొన్న‌టికి మొన్న మూడు సెట్ల నామినేష‌న్లు వేసేసి, నిన్న‌నే త‌న‌కు ఓటేయాలంటూ రాష్ట్రాలు ప‌ట్టుకుని తిరిగేందుకు బ‌య‌లుదేరిన కోవింద్ అప్పుడే ఎలా గెలిచార‌నేగా మీ డౌటు? అయినా పోలింగ్ జ‌ర‌గ‌కుండా విజ‌యం సాధ్యం ఎలాగంటారా? ఇంకా నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా ముగియ‌కుండానే కోవింద్ గెలిచార‌ని ఎలా చెబుతార‌ని ప్ర‌శ్నిస్తారా? అయితే… ఈ విష‌యాలు చ‌దివితే.. కోవింద్ గెలిచారో, లేదో … మీకే తెలుస్తుంది.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఏ ఒక్క‌రు ఊహించ‌ని విధంగా ఎన్డీఏ అభ్య‌ర్థిగా తెరపైకి వ‌చ్చిన కోవింద్‌కు… ఎన్డీఏ వైరివ‌ర్గంగా ఉన్న జేడీయూ నేత‌, బీహార్ సీఎం నితీశ్ కుమార్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇక తెలుగు రాష్ట్రం తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ మద్ద‌తు కూడా కోవింద్‌కే నంటూ ఆ పార్టీ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు బ‌ల్ల‌గుద్దీ మ‌రీ చెప్పారు. చెప్ప‌డమే కాదండోయ్… ఎన్డీఏలో భాగ‌స్వామ్యం లేకున్నా… కోవింద్ నామినేష‌న్ ఘ‌ట్టానికి హాజరైన కేసీఆర్‌… త‌మ పార్టీ మ‌ద్ద‌తు మీకేనంటూ కోవింద్‌కే నేరుగా చెప్పేశారు.

ఎన్డీఏలోని కీల‌క భాగ‌స్వామి బీజేపీ, ఆ కూట‌మిలోని మిగిలిన పార్టీల‌న్నీ కూడా కోవింద్ అభ్య‌ర్థిత్వానికి అనుకూలంగానే ఓటు వేయ‌నున్నాయి. మొత్తం ఓట‌ర్ల‌లో సగం మేర (48) శాతం ఓట్లు ఎన్డీఏకు ఉండ‌గా, కొత్త‌గా  జేడీయూ, టీఆర్ఎస్ కూడా వ‌చ్చి చేర‌డంతో ఆ శాతం కాస్తా స‌గానికి చేరింది. ఇక త‌మిళ‌నాడులోని అధికార పార్టీ అన్నాడీఎంకేలోని అన్ని వ‌ర్గాలు కూడా కోవింద్‌కే మ‌ద్ద‌తు తెలిపాయి. ఈ క్ర‌మంలో విజ‌యానికి స‌రిప‌డ స‌గానికి పైగా ఓట్లు కోవింద్ ఖాతాలో ప‌డ‌టం ఖాయ‌మే. ఈ నేప‌థ్యంలో పోలింగ్ అంతా సాంకేతికంగా జ‌రుగుతుందే త‌ప్పించి… విజ‌యం మాత్రం కోవింద్‌నే వ‌రిస్తుంది క‌దా. 
 
ఇక రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎల‌క్టోర‌ల్ కాలేజీ ఓట్ల సంఖ్య మొత్తం 10,98,903 కాగా… అందులో సగం ఓట్లు సాధించే అభ్య‌ర్థి విజ‌యం సాధించిన‌ట్లు లెక్క‌. మ‌రి ఇప్ప‌టికే 62 శాతం మేర ఓట్లు అంటే… 7 ల‌క్ష‌ల ఓట్ల‌ను… అంటే మూడొంతుల్లో రెండొంతుల మేర ఓట్ల‌ను పోగేసిన కోవింద్ త‌ప్ప‌నిస‌రిగా గెలుస్తారు క‌దా. ఈ లెక్క‌కు సంబంధించి అన్ని కోణాల‌ను విశ్లేషిస్తూ జాతీయ ప‌త్రిక‌లు ప‌లు క‌థ‌నాల‌ను రాసేస్తున్నాయి. అంటే… వ‌చ్చే నెల 17న జ‌రిగే ఎన్నిక‌ల్లో కోవింద్ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మేన‌న్న మాట‌.
https://www.youtube.com/watch?v=pgL4MGFskLA

Recent Random Post: