లవర్‌, పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మెహబూబ్‌

తెలుగు బిగ్ బాస్‌ సీజన్‌ 4 తో మంచి గుర్తింపు దక్కించుకున్న యూట్యూబ్ స్టార్‌ మెహబూబ్‌ కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగి పోతుంది. అతడు రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో అభిమానులతో చిట్ చాట్‌ చేయడంతో పాటు తన ఫొటోలు వీడియోలను షేర్‌ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన అభిమానులతో చిట్ చాట్ సందర్బంగా పెళ్లి మరియు ప్రియురాలు గురించి క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి చేసుకునే విషయంలో ఇప్పుడే ఆలోచన లేదు అంటూ క్లారిటీ ఇచ్చిన మెహబూబ్‌ లవర్ ఫొటోను ఒక అభిమాని అడిగాడు. ఆ సమయంలో మెహబూబ్ షేర్‌ చేసిన ఫొటో అందరిని ఆశ్చర్యపర్చింది.

ఒక అభిమాని సోషల్‌ మీడియాలో మీ లవర్ ఫొటోను షేర్‌ చేయవచ్చు కదా అంటూ ప్రశ్నించగా వెంటనే తాను జిమ్ లో ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు. ఆ సమయంలోనే నాకు కష్టంను ఇచ్చేది మరియు సంతోషాన్ని ఇచ్చేది రెండు కూడా ఇదే. అందుకే జిమ్ నా లవర్ అన్నాడు. ఇక పెళ్లి గురించి స్పందిస్తూ పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచించేందుకు భయంగా ఉంది. భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేను అన్నాడు.