కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే ఒకింత విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ మధ్య గో కరోనా గో.. అంటూ నినదించిన ఈ మంత్రిగారు, ఇప్పుడు చైనీస్ ఫుడ్ ను బహిష్కరించాలని, చైనీస్ ఫుడ్ ను అమ్మే రెస్టారెంట్లను మూసేయాలంటూ విచిత్రమైన వ్యాఖ్యానాలు చేశారు! చైనీ వస్తువులను వాడటం తగ్గించాలంటూ పిలుపునివ్వడం ఒక ఎత్తు అయితే, ఈ మంత్రిగారు ఏకంగా చైనీ ఫుడ్ ను తినకూడదని పిలుపునిచ్చారు!
దేశంలో చైనీస్ ఫాస్ట్ ఫుడ్ కు చాలా క్రేజ్ ఉంది. సాయంత్రమైతే చాలా మందికి అలాంటి ఫాస్ట్ ఫుడ్ తినడం అలవాటు. అయితే అది వండే పద్ధతి చైనీ అయితే కావొచ్చు కానీ, ఆ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ను అమ్ముతూ దేశంలో కొన్ని లక్షల మంది రెస్టారెంట్ ఓనర్లు బతుకీడుస్తున్నారు. చిన్న చిన్న పట్టణాల్లో కూడా అలాంటి ఫాస్ట్ ఫుడ్ అమ్మకాలు సాగుతూ ఉంటాయి. గత దశాబ్ధంన్నర కాలంలో ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ అమ్మకం విపరీతంగా పెరిగింది. అది ఆరోగ్యానికి మంచిది కాదని అనేక మంది చెబుతూ ఉన్నా.. జనాలు మాత్రం ఆ రుచికి అలవాటు పడిపోయారు.
అయితే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అంటే..అదేదో చైనాలో తయారై వస్తోందని అనుకున్నారో ఏమో కానీ మంత్రిగారు… లఢక్ లో జరిగిన ఘటనపై రియాక్ట్ అవుతూ చైనీ ఫుడ్ ను బహిష్కరించాలని, చైనీ ఫుడ్ ను అమ్మే రెస్టారెంట్లను మూసేయాలని సూచించేశారు. మొత్తానికి మోడీ ప్రభుత్వంలోని వాళ్లు ప్రతి సారీ ఫుడ్ మీదే కాన్సన్ ట్రేట్ చేసేలాగున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు చేసిన రామ్ దాస్ అథవాలే ను సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
Recent Random Post: