
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని మహానటుల్లో మోహన్ బాబు ఒకడు. 40 ఏళ్లకు పైగా సాగుతున్న సుదీర్ఘ కెరీర్లో ఆయన ఎన్నో విలక్షణ పాత్రలు వేశారు. 500కు పైగా సినిమాలు చేసిన ఘనత మోహన్ బాబుది. ఐతే ఒకప్పుడు తీరిక లేకుండా నిర్విరామంగా సినిమాలు చేసిన మోహన్ బాబు.. గత కొన్నేళ్లుగా జోరు తగ్గించేశారు.
ఎప్పుడో రెండేళ్లకో మూడేళ్లలో ఓ సినిమా చేస్తున్నాడాయన. చివరగా రెండేళ్ల కిందట ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమాలో నటించాడు మోహన్ బాబు. దానికి ముందు ‘రౌడీ’తో పలకరించాడాయన. ‘మామ మంచు..’ తీవ్ర నిరాశకు గురి చేయడంతో మోహన్ బాబు వెంటనే మళ్లీ ఇంకో సినిమా చేయలేదు.
ఐతే ఎట్టకేలకు కలెక్షన్ కింగ్ మళ్లీ ముఖానికి రంగేసుకుంటున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా పేరు.. ‘గాయత్రి’ కావడం విశేషం. ‘ఆ నలుగురు’ సినిమాతో రచయితగా పరిచయమై.. ఆ తర్వాత దర్శకుడిగా మారి ‘పెళ్లైన కొత్తలో’, ‘ప్రవరాఖ్యుడు’ లాంటి సినిమాలు తీసిన మదన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. మోహన్ బాబు సొంత నిర్మాణ సంస్థ ‘లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ సినిమాలో మంచు విష్ణు కూడా ఓ కీలక పాత్ర చేస్తాడని.. యాంకర్ అనసూయ ఇందులో నటిస్తుందని సమాచారం. ఇంతకుముందు మోహన్ బాబు-విష్ణు కాంబినేషన్లో ‘గేమ్’, ‘రౌడీ’ సినిమాలొచ్చాయి. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించే సినిమాకు ‘గాయత్రి’ అనే టైటిల్ పెట్టడం ఆసక్తి రేకెత్తించేదే.
Recent Random Post:

















