
అంతా అనుకున్న ప్రకారం జరిగితే.. ఈపాటికి నాని కొత్త సినిమా ‘నేను లోకల్’ కూడా రిలీజైపోవాల్సింది. డిసెంబరు 23న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల సినిమా వాయిదా పడిపోయింది. సినిమా వాయిదా అన్న అప్ డేట్ ఇచ్చాక.. మళ్లీ దాని గురించి చర్చే లేదు. దిల్ రాజు మీద డీమానిటైజేషన్ దెబ్బ పడటం వల్ల కొన్నాళ్ల పాటు ఈ సినిమా షూటింగ్ కూడా ఆగినట్లు వార్తలొచ్చాయి. మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారో లేదో.. సినిమా ఎంత వరకు వచ్చిందో ఏమో కానీ.. ఉన్నట్లుండి ఈ సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టేసింది చిత్ర బృందం.
ఈ శుక్రవారం ‘నేను లోకల్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. గత కొన్ని రోజులుగా ‘ఖైదీ నెంబర్ 150’ సింగిల్స్ తో రచ్చ రచ్చ చేస్తూ వస్తున్న దేవిశ్రీ ప్రసాద్.. ‘నేను లోకల్’ విషయంలోనూ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ‘నెక్స్ట్ ఏంటి’.. అంటూ సాగే పాటను అతను ముందుగా రిలీజ్ చేస్తున్నాడు. నానితో తొలిసారి పని చేస్తున్న దేవిశ్రీ అతడి శైలికి తగ్గట్లుగా ఓ వెరైటీ పాటను ట్యూన్ చేశాడట. ఈ పాట కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని అంటున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఈ పాటను లాంచ్ చేస్తారు. ఇలా ఒక్కో పాట రిలీజ్ చేసి.. ఈ నెలాఖర్లో ఆడియో విడుదల చేస్తారట. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ‘నేను లోకల్’ ఫిబ్రవరిలో రిలీజయ్యే అవకాశముంది. నాని సరసన ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది.
Recent Random Post: