నారా రోహిత్‌కు జ్నానోదయం అయింది

ఒకే సమయంలో చేతిలో తొమ్మిది సినిమాలున్న హీరో గత రెండు మూడు దశాబ్దాల్లో ఎవరైనా ఉన్నారేమో వెతికి చూస్తే ఒక్క నారా రోహిత్ తప్ప ఇంకెవరూ కనిపించరు. గత ఏడాది ఆరంభంలో అతడి చేతిలో ఏకంగా 9 సినిమాలుండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. వాటిలో చాలా వరకు సినిమాలు ప్రామిసింగ్ గా అనిపించాయి. ఏడాది ముగిసేరికి నారా రోహిత్ కెరీర్ ఎక్కడో ఉంటుందని అంచనా వేశారంతా. కానీ అతడి కెరీర్ ఎక్కడికీ వెళ్లిపోలేదు. ఉన్నచోటే ఉంది. నిజానికి ఉన్నచోట ఉన్నందుకు నారా రోహిత్ సంతోషించాలి. ఎందుకంటే గత ఏడాది ఓ క్వార్టర్ ముగిసేసరికి అతడి పరిస్థితి అయోమయంగా ఉంది.

తుంటరి, సావిత్రి, రాజా చెయ్యి వేస్తే.. ఇలా వరుసగా మూడు సినిమాలూ ఫ్లాపవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు రోహిత్. మరోవైపు లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘శంకర’ విడుదలకు రెడీ అవడంతో రోహిత్ ఖాతాలో మరో ఫ్లాప్ పక్కా అని అందరూ ఫిక్సయిపోయారు. ఇలాంటి టైంలో ఏడాది చివర్లో రోహిత్ కెరీర్ పుంజుకుంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన ‘జ్యో అచ్యుతానంద’, ఏడాది చివర్లో వచ్చిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ రోహిత్‌ను నిలబెట్టాయి. శంకర మధ్యలో విడుదలైనా వార్తల్లో లేకపోవడం రోహిత్‌కు కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో 2016 తనకు పెద్ద గుణపాఠం అంటున్నాడు రోహిత్.

వరుసగా సినిమాలు చేయడం వరకు ఓకే కానీ.. మరీ తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదని తేలిందన్నాడు. ఇలా చేయడం వల్ల ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యారన్నాడు. ఇకపై ఒక సినిమా విడుదలకు రెడీ అవుతున్న సమయంలో ఇంకో సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకుండా చూసుకుంటానని.. 2017లో జాగ్రత్తగా అడుగులేస్తానని చెప్పాడు. మొత్తానికి గత ఏడాది అనుభవాలతో రోహిత్‌కు బాగానే జ్నానోదయం అయినట్లుంది.


Recent Random Post: