
పెద్ద సినిమాలు రిలీజైనపుడల్లా తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల కోసం బెనిఫిట్ షోలు వేయడం మామూలే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోల హడావుడి బాగా ఉంటుంది. అర్ధరాత్రి నుంచే షోలు పడిపోతుంటాయి. డిమాండును బట్టి టికెట్ల రేట్లు పెడుతుంటారు. ఐతే ఏపీలో చిన్నా పెద్దా అని లేకుండా ప్రతి టౌన్లో.. ప్రతి సిటీలోనూ బెనిఫిట్ షోలు పడుతుంటాయి కానీ.. తెలంగాణలో ఒక్క హైదరాబాద్కు మాత్రమే బెనిఫిట్ షోలు పరిమితం.
ఐతే ఇంతకుముందులాగా భాగ్యనగరంలో బెనిఫిట్ షోలకు అనుమతి అంత ఈజీగా దొరకట్లేదు. బెనిఫిట్ షోల పేరుతో అభిమానుల్ని దారుణంగా బాదేస్తుండటం.. కొందరు స్వార్థపరులు ఈ షోల ద్వారా బాగా సొమ్ము చేసుకుంటూ ఉండటంతో ఈ మధ్య పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ‘కాటమరాయుడు’ లాంటి పెద్ద సినిమాకు కూడా బెనిఫిట్ షోలకు అనుమతి దొరకలేదు.
అయినప్పటికీ ‘బాహుబలి-2’ మీద ఉన్న భారీ అంచనాల్ని దృష్టిలో ఉంచుకుని ఎలాగైనా పర్మిషన్ సంపాదించి.. బెనిఫిట్ షోలు వేయాలని కొందరు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. అనుమతి దక్కలేదు. ‘కాటమరాయుడు’ బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వనందుకు పవన్ అభిమానులు ఆ రోజు ఎంత గొడవ చేశారో తెలిసిందే.
మరి పవన్ సినిమాకు పర్మిషన్ ఇవ్వకుండా ‘బాహుబలి-2’కు ఇస్తే వాళ్లు ఊరుకుంటారా? పైగా తెలంగాణలో రోజుకు ఐదు షోలకు అనుమతి ఇవ్వడంతో ఉదయం 7-7.30కే షోలు మొదలవుతున్నాయి. దీంతో బెనిఫిట్ షోల అవసరమే లేదని తేల్చేశారు పోలీసులు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఆరు షోలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచే షోలు పడబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కూడా బెనిఫిట్ షోల హడావుడి అంతగా కనిపించట్లేదు.
Recent Random Post: