ఎన్టీఆర్ చేయగలడా అనే అనుమానమే అక్కర్లేదు

ఎన్టీఆర్ తో వర్క్ చేసిన వారు ఎంతో మంది ఆయన గొప్పతనం గురించి మంచితనం గురించి ఆయన కష్టపడే తీరు గురించి చెబుతూ ఉంటారు. ఆయన డాన్స్ నుండి మొదలుకని యాక్షన్ సన్నివేశాల వరకు సింగిల్ టేక్ ఆర్టిస్టు అంటూ దిగ్గజాలు కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎంతో మందికి అభిమాన నటుడు అయిన ఎన్టీఆర్ గురించి లేడీ సినిమాటోగ్రాఫర్ విజయశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆమె 2001 సంవత్సరంలో విడుదల అయిన ఎన్టీఆర్ సుబ్బు సినిమాకు వర్క్ చేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్ వయసు చాలా తక్కువ. అయినా కూడా ఆయన సినిమా కోసం పడ్డ కష్టం.. పట్టుదల గురించి విజయశ్రీ పేర్కొన్నారు. ఎన్టీఆర్ అది చేయగలడా అనే అనుమానం ఆయనతో వర్క్ చేసే ఏ ఒక్కరికి కూడా ఉండదు అన్నారు.

ఇంకా విజయశ్రీ మాట్లాడుతూ.. కెరీర్ ఆరంభంలోనే ఆయన ఒక గొప్ప నటుడు. చిన్నతనంలోనే అద్బుతమైన నటన కనబర్చిన అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే. సుబ్బు సినిమా సమయంలో అతడు కొత్తవాడు.. నటనకు కొత్తే అయినా కూడా యాక్షన్ సన్నివేశాల విషయంలో అతడి నటనకు అందరం ఆశ్చర్యపోయాం.

ఇన్నోసెంట్ గా కనిపించినా ఉడుకు రక్తంతో పెద్ద సాహసాలే చేశాడు. ఎన్టీఆర్ తో వర్క్ చేస్తున్న సమయంలో ఆయన ఇది చేయగలడా అనే సెకండ్ థాట్ ను ఎవరు పెట్టుకోరు. అతడు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటాడు. డాన్స్ మరియు యాక్షన్ లో ఆయన పరిణితి సాధిస్తూనే ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ ను చూసి అద్బుతంగా అనిపిస్తుందన్నారు.

టాలీవుడ్ లో వన్ అండ్ ఓన్లీ కెమెరా ఉమెన్ గా పేరు దక్కించుకున్న ఆమె ఎన్టీఆర్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అభిమానులు పెద్ద ఎత్తున వాటిని షేర్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా లో నటిస్తున్నాడు. ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వం లో ఒక సినిమాను చేసేందుకు ఇప్పటికే కమిట్ అయ్యాడు.

వీరిద్దరి కాంబోలో ఇప్పటికే జనతా గ్యారేజ్ వచ్చి విజయాన్ని సొంతం చేసుకుంది. కొరటాల శివ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ సినిమా ఉంది. ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారి పోవడం ఖాయం.. ఇక ముందు అన్ని ఎన్టీఆర్ సినిమా లు బాలీవుడ్ బాక్సాఫీస్ ను కూడా షేక్ చేస్తాయని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.