బాలయ్య కు వారం టైం ఇచ్చాడు ఎన్టీఆర్

పోయినేడాది సంక్రాంతికి నందమూరి అబ్బాయి.. బాబాయి ఒక్క రోజు వ్యవధిలో బాక్సాఫీస్ దగ్గర తలపడ్డారు. ఇప్పుడు వారం వ్యవధిలో నందమూరి హీరోలు బాక్సాఫీస్ దగ్గర అమీతుమీ తేల్చుకోబోతున్నారు. నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘పైసా వసూల్’ను దసరా కానుకగా సెప్టెంబరు 29న విడుదల చేయబోతున్నట్లు ఈ సినిమా ఆరంభమైన రోజే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మాటకు కట్టుబడే సినిమా రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పుడు దసరా రేసులోకి ఎన్టీఆర్ మూవీ ‘జై లవకుశ’ వచ్చేసింది. కాకపోతే బాలయ్య సినిమా వచ్చిన వీకెండ్లోనే ఇది రావట్లేదు. వారం ముందుగా.. సెప్టెంబరు 21న ‘జై లవకుశ’ను రిలీజ్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ మేరకు ప్రకటన చేశారు.

పోయినేడాది ‘జనతా గ్యారేజ్’ విడుదలైన సెప్టెంబరు 1కే ‘జై లవకుశ’ను కూడా విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అంతకంటే మూడు వారాలు ఆలస్యంగా సినిమా విడుదల కాబోతోంది. ఇంకో పది రోజుల్లోపే ‘జై లవకుశ’ టీజర్ కూడా లాంచ్ చేయబోతున్నారు. జులై 5న టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ వర్గాలు ధ్రువీకరించాయి.

‘పవర్’.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాల దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జై లవకుశ’లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాశి ఖన్నా.. నివేదా థామస్ ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్నాడు.


Recent Random Post: