తెలంగాణలో బాహుబలి షోలు ఐదు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాను వారం రోజుల పాటు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ‘బాహుబలి’ నిర్మాతలకు తీపి కబురు అందించింది. ఏపీ ప్రభుత్వం స్థాయిలో ఆరు షోలకు అనుమతి ఇవ్వలేదు కానీ ఒక షో అదనంగా వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేసింది.

ఈ విషయమై ‘బాహుబలి’ నిర్మాత ప్రసాద్ దేవినేని.. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను కలిసి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అదనపు షో వేసుకోవడానికి ప్రభుత్వం అంగీకరిస్తోందని తలసాని హామీ ఇచ్చారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఐతే రోజుకు ఐదు షోలు ఎన్ని రోజుల పాటు కొనసాగుతాయన్నది ఇంకా స్పష్టత లేదు. బహుశా ఏపీలో లాగే వారం రోజుల పాటు ఇందుకు అనుమతి దక్కవచ్చని భావిస్తున్నారు. తెలంగాణ థియేటర్లలో మామూలుగానే రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఐతే ఐదో షో చిన్న సినిమాకే కేటాయించాలన్నది ప్రభుత్వ షరతు.

అది ఎప్పుడు అమల్లోకి వస్తుందో కానీ.. గత ఏడాది ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు తొలి రోజు మాత్రం ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి కోరగా ప్రభుత్వం సరే అంది. కానీ దాని వల్ల ఆ చిత్రానికి ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. ‘బాహుబలి: ది కంక్లూజన్’కు మాత్రం అదనపు షో వల్ల చాలా లాభం ఉంటుందనడంలో సందేహం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదనపు షోలు పడుతుండటంతో తొలి వారం కలెక్షన్ల మోత ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయడం కష్టమే.


Recent Random Post: