
టాలీవుడ్ స్టార్ రైటర్స్ లో ప్రముఖంగా వినిపించే పేరు పరచూరి బ్రదర్స్. వారిద్దరూ రచయితలుగానే కాకుండా నటులుగా కూడా ప్రేక్షకులకు సుపరిచితులే. తన కెరీర్ లో చాలామంది హీరోలకు కథలందించిన పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ ….జూ.ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. గతంలో ఓ సందర్భంలో జూ.ఎన్టీఆర్ తన ఆకలి తీర్చాడని పరుచూరి షో సందర్భంగా వెల్లడించారు. తనకు ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం గురించి వివరించారు.
పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఖాతాలో ‘పరుచూరి పలుకులు’ పేరిట ప్రతి మంగళవారం తన అభిప్రాయాలు, అనుభవాలను పంచుకుంటుంటారు. ఈ రోజు ఎపిసోడ్ లో జూ.ఎన్టీఆర్ గురించి అనేక విషయాలు చెప్పారు. హిందీ బిగ్‌బాస్ ఎప్పుడూ చూడలేదని, తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్‌గా వస్తోన్న బిగ్ బాస్ షోను చూస్తున్నానని తెలిపారు. అన్నగారు ఎన్టీఆర్ పిల్లల్లో తనకు మొట్టమొదట నందమూరి హరికృష్ణ పరిచయం అయ్యారని గోపాలకృష్ణ అన్నారు. ఆయన కుమారుడు ఎన్టీఆర్‌తో కూడా తనకు ఓ అనుభవం ఉందని చెప్పారు. బాలరామాయణం షూటింగ్ సమయంలో రైల్లో వెళుతున్నపుడు రైల్లో క్యాటరింగ్ సౌకర్యం ఆగిపోయిందని తెలిపారు. ఏం చేయాలో తెలియక ఆకలితో ఉన్న సమయంలో ఆ చిన్నారి ఎన్టీఆర్(12) ఒక బాక్స్ తనకిచ్చి తినమన్నాడని చెప్పారు. అమ్మ తనకు మరో బాక్సు ఇచ్చిందని ఎన్టీఆర్ అన్నాడని చెప్పారు.
ఆకలితో ఉన్న సమయంలో ఆ బాక్స్ ఇవ్వగానే తన కళ్లలో నీళ్లు తిరిగాయని, భావోద్వేగానికి గురయ్యానని పరుచూరి చెప్పారు. పన్నెండేళ్ల వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ లో అన్నగారు కనిపించారన్నారు. తెలుగు బిగ్‌బాస్‌షో తనకు బాగా నచ్చిందని తెలిపారు. ఒక రియాలటీ షో నడపడానికి ఎంతో సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం ఉండాలని, ఎన్టీఆర్ ఎంతో చక్కగా నిర్వహిస్తున్నాడని కితాబిచ్చారు. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, ఇప్పుడు లేవని ఆయన చెప్పారు. ఈ షో మనుషుల మధ్య అనుబంధాల్ని, ఆత్మీయతలను పెంపొందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Recent Random Post: