జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ విదేశాల్లో తన రాబోయే సినిమా అయిన కాటమరాయుడు షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఇద్దరు ప్రముఖులు అకస్మాత్తుగా తనువు చాలించడం పవన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండెపోటుతో అకస్మాత్తుగా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తుది శ్వాస విడవడంపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పీఆర్పీలో ఉన్నప్పుడు భూమా నాయకత్వ లక్షణాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. భూమా నాగిరెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటని పవన్ అన్నారు. విషాదాన్ని తట్టుకునే ధైర్యం వారి కుటుంబానికి ఇవ్వాలని దేవున్ని కోరుకుంటున్నానని పవన్ సంతాపం తెలిపారు.
కాగా, సినీ పరిశ్రమ ప్రముఖుడు, నిర్మాత దిల్ రాజు భార్య శ్రీమతి అనిత మరణించడం సైతం పవన్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. “విదేశాలలో కాటమరాయుడు షూటింగులో ఉన్న సమయంలో దిల్ రాజు సతీమణి మరణవార్త విని నమ్మలేకపోయాను. ఈ వార్త నిజం కాకూడదని అనుకున్నాను. ఎందుకంటే రాజు-అనితలది అంత అన్యోన్యమైన దాంపత్యం. సినీ పరిశ్రమలో నాకున్న కొందరు ఆత్మీయుల్లో దిల్ రాజు ముఖ్యమైన వ్యక్తి. అటువంటి ఆత్మీయ వ్యక్తికి ఇంతటి కష్టం రావడం నా మనసును ఎంతో కలచివేస్తోంది. దిల్ రాజు నిర్మించే చాల చిత్రాలకు శ్రీమతి అనిత సమర్పకురాలిగా ఉండేవారు. ఆలా ఆమెకు కుడా సినీ పరిశ్రమతో సంబంధ భాంధవ్యాలు ఉన్నాయి. నాలుగున్నర పదుల వయస్సులోనే ఆమె అకాల మరణం చెందడం రాజు కుటుంబానికి తీరని లోటు. ఊహించని ఈ విపత్తును తట్టుకోడానికి రాజుకు ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని, శ్రీమతి అనిత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను”అని పవన్ పత్రాకా ప్రకటన విడుదల చేశారు.
ఇద్దరి ప్రముఖుల ఆకస్మిక మరణం పట్ల పవన్ స్పందించిన తీరు…ఆయనకు తెలుగువారిపట్ల ఉన్న మమకారాన్ని, ప్రేమ అభిమానాలను చాటిచెప్పినట్లయిందని అంటున్నారు.
Recent Random Post: