ఆంధ్రప్రదేశ్ ‘గంజాయి మాఫియా’పై జనసేనాని ‘ట్వీటు – పోటు’.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి హబ్‌గా మారిపోయింది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. దేశంలో ఎక్కడ గంజాయి దొరుకుతున్నా, దానికి లింకులు అటు తిరిగి ఇటు తిరిగి ఆంధ్రప్రదేశ్‌లోనే లభ్యమవుతున్నాయి. ‘అబ్బే, ఆంధ్రప్రదేశ్‌కీ డ్రగ్స్‌కీ సంబంధం లేదు..’ అంటూ ఏపీ ప్రభుత్వం ఎంత బుకాయిస్తున్నా, ‘గంజాయి’ మూలాలు మాత్రం, రాష్ట్రంలోనే కనిపిస్తున్నాయి. ఇదో తలనొప్పి వ్యవహారంగా మారింది అధికార వైసీపీకి.

‘చంద్రబాబు హయాంలోనే గంజాయి మాఫియా రెచ్చిపోయింది.. మేం దాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాం..’ అని వైసీపీ చెబుతోంటే, కనీ వినీ ఎరుగని స్థాయిలో గంజాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళుతూనే వుంది. ఈ మొత్తం వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీటాస్త్రాలు సంధిస్తున్నారు.

ఏదో ఉత్త ఆరోపణలు చేయడం కాదు, గంజాయి వ్యవహారానికి సంబంధించి వివిధ రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు చేస్తున్న ప్రకటనల్ని తన ట్వీట్లకు జోడిస్తున్నారు. ఆధారాలంటే ఇవీ.! ఆధారాలతో సహా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చేతకానితనాన్ని ఎండగడుతున్న జనసేనానిపై ప్రశంసల జల్లు కురుస్తోంది సోషల్ మీడియా వేదికగా.

ఇక్కడ బులుగు బ్యాచ్ ఎటూ పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించో, ప్యాకేజీ.. అంటో చెత్త ఆరోపణల గురించో ప్రస్తావించడం మామూలేననుకోండి.. అది వేరే విషయం. పవన్ కళ్యాణ్‌ని ఈ విషయంలో విమర్శించాలనుకునేవాళ్ళు, గంజాయి కారణంగా రాష్ట్ర యువత, రాష్ట్రం పరువు ప్రతిష్టలు నాశనమైపోతున్నాయన్న విషయాన్ని కాస్త గుర్తు పెట్టుకుంటే బావుంటుందేమో.

దశాబ్దలుగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో.. మరీ ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతోన్న మాట వాస్తవం. కానీ, దాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. దేశంలో ఎక్కడా లేని ఈ పైత్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎందుకు.? అన్నది అత్యంత కీలకమైన అంశం.