ఏపీ ప్రభుత్వ విధానం సరికాదు.. పునరాలోచించాలి: పవన్ కల్యాణ్

తెలుగు రాష్ట్రాల్లో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పరిస్థితుల దృష్ట్యా రెండు ప్రభుత్వాలు మరింత అప్రమత్తమై కోవిడ్ నివారణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సేవలు అందించే పోలీసులు, క్షేత్రస్థాయి సిబ్బంది కోవిడ్ బారిన పడటం విచారకరమన్నారు.

కోవిడ్ పరీక్షలు, పరీక్షా కేంద్రాలు, మొబైల్ పరీక్షా కేంద్రాలు పెంచడంతోపాటు ఫస్ట్ వేవ్ లో పాటించిన ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఏపీలో భారీగా కేసులు నమోదవుతున్న వేళ పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని కోరారు. పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తికాకపోవడం, వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఈపరిస్థితుల్లో మద్యం దుకాణాలకు మరో గంటపాటు సమయం పెంచడం అనాలోచిత నిర్ణయమని అన్నారు. ప్రజలకు నిత్యావసరాల పంపిణీ, వైద్య సదుపాయాలు మెరుగుపరడంపై దృష్టి సారించాలని అన్నారు. ప్రజలంతా మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని కోరారు.