
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమై మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా చేసిన ప్రకటన అధికార తెలుగుదేశం పార్టీలో కలకలం రేకెత్తిస్తోందని అంటున్నారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తానంటూ పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జనసేన అధినేత ఈ ప్రకటన చేయడం ఆలస్యం అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయని చర్చ జరుగుతోంది. అధికార తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన అనంతపురంలో సైకిల్ జోరుకు బ్రేకులు వేసే విధంగా పవన్ అడుగులు ఉండటం వల్లే ఈ టాక్ మొదలైంది.
2019 ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తానని పవన్ స్వయంగా ప్రకటించడంతో ఒక్కసారిగా అనంతపురం జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే అనంతలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు జనసేన రంగం సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. మరోవైపు అనంత అర్బన్‌లో ఆయన సామాజిక వర్గం బలంగా ఉండడంతోనే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే చర్చలు సాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో నెలకొన్న సమస్యలపై పవన్ కల్యాణ్ ఇప్పటికే తన వాణి వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఎంట్రీతో ఆ ప్రభావం రాయలసీమ మొత్తం మీద ఉండే అవకాశాలున్నాయని ఆయన అభిమానులు అంటున్నారు. పవన్ పోటీతో టీడీపీ కంచుకోటకు బీటలు వారుతాయని పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
మరోవైపు పవన్ ప్రకటనతో ఇతర పార్టీల నేతలకు పవన్ టెన్షన్ పట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తాము…యువతకు 60శాతం సీట్లు ఇస్తామని ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాలు ఎటు దారితీస్తాయో అన్న ఉత్కంఠ మొదలైంది. జనసేన ఎన్నికల ప్రవేశంతో ఏపీ రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఏర్పనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇక వివిధ పార్టీల సీనియర్ నేతలు జనసేనలో చేరతారన్నచర్చ కూడా మొదలైంది. అయితే వైసీపీ, కాంగ్రెస్ వారిని చేర్చుకోనని పవన్ ప్రకటించిన నేపథ్యంలో ఎక్కువగా ప్రభావం తెలుగుదేశం పార్టీ పైనే పడుతుండటం ఖాయం. దీంతో పవన్ దూకుడు అధికార టీడీపీకి నష్టదాయకంగా మారేలాగా ఉందని చెప్తున్నారు.
Recent Random Post: