రఘురామ కృష్ణంరాజు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా నిలుస్తున్న వ్యక్తి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ధిక్కరిస్తూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పార్టీ నాయకత్వాన్ని, నేతల్ని ఏమాత్రం లెక్క చేయకుండా చెడామడా తిట్టేస్తున్నారాయన. వివిధ అంశాలపై ఆయన అభిప్రాయాలు చాలా సూటిగా ఉంటూ.. పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేస్తున్నాయి. కొన్ని నెలల కిందట్నుంచే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న రఘురామకృష్ణం రాజు.. ఇప్పుడు ఇంకా వాడి పెంచారు. తాజాగా ఆయన అమరావతి రైతుల ఉద్యమంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఆయన కొంచెం సున్నితంగానే స్పందించారు.
నా ప్రభుత్వానికి ఇది నా విన్నపం అంటూ.. ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు రఘురామకృష్ణం రాజు. అమరావతి రైతుల ఉద్యమం 200 రోజులకు చేరుకున్న నేపథ్యంలో వారికి రఘురామకృష్ణం రాజు సంఘీభావం తెలిపారు. రాజధానిపై ప్రభుత్వం ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని ఆయనన్నారు. అమరావతి రైతుల అంకితభావం గొప్పదని, రోజూ వారిని గమనిస్తున్నానని ఆయన చెప్పారు. వైసీపీ మ్యానిఫెస్టో కమిటీ అధ్యక్షులుగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అమరావతి కొనసాగుందని అన్నారని, నిండు సభలో జగన్ కూడా అదే చెప్పారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ప్రజల సెంటిమెంట్‌ను గుర్తించాలన్న ఆయన.. రాజధాని విషయమై సూచనలు, సలహాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు.